దోషులకు సుప్రీం బెయిల్‌తో భయాందోళన
ఆ ఉత్తర్వులకు వ్యతిరేకంగా పోరాడతా : బాధితురాలి బిల్కిస్ బానో
అహ్మదాబాద్ : సామూహిక లైంగికదాడి, ఏడుగురు కుటుంబ సభ్యుల హత్య కేసులో ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ, వారి యావజ్జీవ కారాగార శిక్షను నిలిపివేస్తూ తీర్పునివ్వడంతో భయభ్రాంతులకు గురైన బిల్కిస్ బానో కుటుంబం గుజరాత్‌ను విడిచి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని ఆమె బంధువు మంగళవారం తెలిపారు. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక లైంగికదాడి, ఆమె కుటుంబంలోని ఏడుగురిపై హత్య కేసులో 2008లో ముంబైలోని ప్రత్యేక సీబీఐ కోర్టు 11 మందిని దోషులుగా నిర్ధారించింది. 14 ఏండ్లు జైలులో గడిపారని, మంచి ప్రవర్తన కలిగివున్నారని పేర్కొంటూ గుజరాత్ ప్రభుత్వం ఈ 11 మందినీ 2022లో విడుదల చేయగా, 2024 జనవరిలో సుప్రీంకోర్టు రద్దు చేసింది. అనారోగ్యంతో ఉన్నామని, సుదీర్ఘ కాలం జైలులో ఉన్నామని ఇద్దరు దోషులు పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ పిబి వరలేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బిపిన్ చంద్ర జోషి, ప్రదీప్ మోర్దియాలకు విధించిన యావజ్జీవ కారాగార శిక్షలను అక్టోబర్ 28న నిలిపివేసి, బెయిల్ మంజూరు చేసింది.
దీంతో దుర్మార్గమైన కేసుల విషయంలో సానుభూతి చూపకూడదన్న అంశాన్ని ధర్మాసనం పరిగణనలోకి తీసుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం విచారణ కూడా జరగకుండా ఎందరో అమాయకులు దశాబ్దాలుగా జైళ్లలో మగ్గిపోతున్నారని, వారి గురించి ఆలోచించకుండా ఈ కేసులో బెయిల్ మంజూరు చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఈ కేసులో దోషులుగా తేలిన 11 మందిలో ఇద్దరికి శిక్షలను నిలిపివేస్తూ, వారికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
‘‘ఆమె (బానో) సుప్రీం తీర్పు ముందు వరకు గుజరాత్‌లోనే ఉంది. కానీ భయం కారణంగా, ఆ కుటుంబం ఎప్పటికప్పుడు తమ నివాస స్థలాన్ని మార్చుకుంటుండేది. కానీ అక్టోబర్ 28న సుప్రీంకోర్టు ఇద్దరు దోషులకు బెయిల్ మంజూరు చేసిన తర్వాత, ఆ కుటుంబం నవంబర్ 2-3 తేదీల్లో రాష్ట్రాన్నే విడిచి వెళ్లిపోయింది. ఈ విషయం గురించి మాకు ఎవరూ తెలపలేదు. బానో న్యాయవాదికి కూడా దీని గురించి తెలియదు. సోషల్ మీడియా ద్వారానే ఈ విషయం తెలుసుకున్నాం. సుప్రీంకోర్టు తీర్పు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ’’అని గుజరాత్‌లోని దాహోద్ జిల్లాలోని దేవ్‌గఢ్ బరియా పట్టణంలో నివసిస్తున్న ఆమె మామ రజాక్ మన్సూరి తెలిపారు.
అంతేకాక ‘‘ఈ దోషులు పెరోల్‌పై బయటకు వచ్చినప్పుడు తరచుగా మా గ్రామానికి తిరిగి వచ్చేవారు. అలా వచ్చినప్పుడు కొన్నిసార్లు 15 రోజులు, మరి కొన్నిసార్లు నెల రోజులు ఉండే వారు. ప్రస్తుతం గోధ్రా, దాహోద్ ఉప-జైళ్లలో ఉన్నారు. ఒక దోషి ప్రస్తుతం ఒక నెల పెరోల్‌పై బయట ఉన్నాడు’’. అని మన్సూరి అన్నారు.
సుప్రీం ఉత్తర్వులు బాధ కలిగించాయి: బానో
తన వాదన వినకుండానే సుప్రీంకోర్టు ఇద్దరు దోషులకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం బాధకలిగించిందని బానో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు తెలిపారు.
‘‘ నన్ను పిలవకుండా, నా వాదన వినకుండా సుప్రీంకోర్టు మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఈ విషయం నాకు పత్రికా కథనాల ద్వారానే తెలిసింది. చాలా బాధపడ్డాను’’ అంటూ బానో కన్నీళ్ల పర్యంతమయ్యారు.
‘‘నాకు 19 ఏండ్ల వయస్సు ఉన్నప్పుడు.. నా ప్రపంచం నా పసిబిడ్డ, నా కుటుంబం, నా ఇల్లు. మానవత్వంపై నాకున్న నమ్మకాన్ని నా నుంచి క్రూరంగా లాగేసుకున్నారు. ఆ రోజు నుంచి 24 ఏండ్లుగా, నా కోసం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలకు న్యాయం కోసం నేను పోరాడుతూనే ఉన్నా. ఈ విషయంలో నాకు లక్షలాది మంది మద్దతు, సంఘీభావపు స్వరాలు తోడుగా నిలవడం వల్లే ఇది సాధ్యమైంది’’ అని ఆమె అన్నారు.
‘‘ అయినా ఈ రోజు, నేను ఎంతో కష్టపడి గెలుచుకున్న న్యాయాన్నే కోల్పోతున్నాను. పాత భయాలు మళ్లీ తలెత్తుతున్నాయి. నాకు మరోసారి భయంగా ఉంది. నా కోసం, నా కుటుంబం కోసం, నా పిల్లల కోసం. న్యాయంపై విశ్వాసాన్ని మరోసారి కోల్పోతానేమోనని కూడా భయమేస్తుంది. నాకు ఇంత అన్యాయం చేసిన వారికి గౌరవనీయమైన సుప్రీంకోర్టు శిక్షను ఎలా నిలిపివేయగలిగింది? కనీసం నాకు తెలియజేయకుండా వారు ఎలా ఉండగలిగారు? కోర్టు గదిలో నా గొంతు వినిపించేలా ఎలా చూసుకోలేకపోయారు?" అని బానో అన్నారు.
‘‘ నా పిల్లలు జీవితాంతం ఈ భయాలు, గాయాలతో బ్రతకడానికి అర్హులు కారని, అందుకే తాను ఈ ఉత్తర్వును వ్యతిరేకిస్తున్నాను. నా మూడేండ్ల కూతురు సలేహా జ్ఞాపకానికి న్యాయం జరగాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరి కోసం నేను ఇది చేస్తున్నాను. ఎందుకంటే ఏ మహిళ, ఏ బాధితురాలు, ఏ పౌరురాలు కూడా ఈ శాశ్వతమైన గుర్తింపు, సమానత్వం పరీక్షను భరించాల్సిన అవసరం లేదు, జీవితాంతం న్యాయం కోసం పోరాడాల్సిన అవసరం లేదు," అని బానో అన్నారు.
న్యాయవ్యవస్థపై అవిశ్వాసం కలిగించింది : బిల్కిస్ బానో
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు తీర్పు తనకు న్యాయవ్యవస్థపై అవిశ్వాన్ని కలిగించిందని 2002 గుజరాత్ అల్లర్ల బాధితురాలు బిల్సిస్ బానో తెలిపారు. ఆ ఉత్తర్వులకు వ్యతిరేకంగా పోరాడతానని స్పష్టం చేశారు. సీనియర్ న్యాయవాది శోభా గుప్తా ద్వారా బిల్కిస్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ తీర్పు తనను దిగ్భ్రాంతికి, బాధకు గురిచేసిందని, న్యాయవ్యవస్థపై అవిశ్వాన్ని కలిగించిందని పేర్కొన్నారు. ‘‘మరోసారి, అంటే రెండవసారి కూడా సుప్రీంకోర్టు నన్ను పిలవకుండానే ఒక ఉత్తర్వు జారీ చేసిందంటే నమ్మలేకపోతున్నాను. తీర్పు గురించి నాకు ప్రతికా కథనాల ద్వారా తెలిసింది’’ అని పేర్కొన్నారు. ‘‘నాకు అన్యాయం చేసిన నిందితుల శిక్షను సుప్రీంకోర్టు ఎలా నిలిపివేయగలదు. కనీసం నాకు సమాచారం కూడా ఇవ్వలేదు. కోర్టులో నా వాదనను ఎందుకు వినలేదు ’’ అని బానో ప్రశ్నించారు. అక్టోబర్ 28న ఈ ఉత్తర్వులు జారీ చేయడానికి ముందు కూడా తనకు సమాచారం ఇవ్వలేదని, తన వాదనను కూడా వినిపించలేదని ఆమె తెలిపారు. ‘‘శిథిలమైన జీవితాన్ని తిరిగి నిర్మించుకున్నాను. నవ్వడం నేర్చుకున్నాను. కానీ, అక్టోబర్ 28 నాటి ఉత్తర్వులు నన్ను మరోసారి భయాందోళనకు గురిచేశాయి’’ అని తెలిపారు.
‘‘ నేను తప్పనిసరిగా ఈ పోరాటం చేయాలి. నా పిల్లల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను. వారు జీవితాంతం భయాలు, గాయాల జ్ఞాపకాలతో బతకాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరి కోసం కూడా నేను ఈ పోరాటం చేస్తున్నాను’’ అని బానో పేర్కొన్నారు.






కామెంట్లు (0)