Magazines

'దాదర్‌' రైల్వే స్టేషన్‌ ఇక 'చైత్యభూమి'

47 నిమిషాల క్రితం

Dadar
avatar
balaji

ప్రచురించబడింది నవం 20, 2026 | 1 నిమిషాల చదవడం

అంబేద్కర్‌ మహాపరినిర్వాణ దినోత్సవానికి ముందు మహారాష్ట్ర సర్కారు ప్రకటన

పేరు మార్పునకు సూత్రప్రాయ ఆమోదం


ముంబయి : మహారాష్ట్రలోని ముంబయి దాదర్‌ రైల్వే స్టేషన్‌ పేరు త్వరలో మారనుంది. ఆ స్టేషన్‌కు చైత్యభూమిగా పేరు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. బుధవారం ఈ విషయాన్ని ప్రకటించింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ మహాపరినిర్వాణ దినోత్సవం (వర్ధంతి) డిసెంబర్‌ 6న జరగ నున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంబేద్కర్‌ అంత్యక్రియలు జరిగిన ప్రదేశమే చైత్యభూమి. ముంబయిలోని దాదర్‌లో ఉన్న ఈ ప్రాంతం ప్రస్తుతం ఆయన స్మారక స్థలంగా కొనసాగుతోంది. ప్రతి ఏడాది డిసెంబర్‌ 6న దేశవ్యా ప్తంగా లక్షలాది మంది అంబేద్కర్‌ అనుచరులు ఇక్కడికి చేరుకుని నివాళులర్పిస్తారు. ఈ నేపథ్యంలో దాదర్‌ రైల్వే స్టేషన్‌కు చైత్యభూమి పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్‌ 7 నుంచి ప్రారంభమయ్యే మహా రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాల్లో ఈ పేరు మార్పు నిర్ణయాన్ని అధికారికంగా ఖరారు చేయనున్నారు.

స్మారక నిర్మాణానికి అదనపు నిధులు

చైత్యభూమికి సమీపంలోని ఇందు మిల్‌ ప్రాంగణంలో నిర్మిస్తున్న అంబేద్కర్‌ స్మారక పనులను వేగవంతం చేసేందుకు అదనపు నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రకటించారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు, చైత్యభూమి పరిసర ప్రాంతాల్లో ధర్నాలు, నిరసనలు, ప్రదర్శనలు, ర్యాలీలను నిషేధించాలని ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ అధికారులకు సూచించారు. కాగా డిసెంబర్‌ 6న అంబేద్కర్‌ మహాపరినిర్వాణ దినోత్సవం సందర్భంగా చైత్యభూమి, శివాజీ పార్కు ప్రాంతాలకు సుమారు 15 లక్షల మంది వస్తారని మహారాష్ట్ర ప్రభుత్వ ప్రజాసంబంధాల విభాగం అంచనా వేసింది. ముంబయిలోని మరో ఎనిమిది రైల్వే స్టేషన్ల పేర్లను మార్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం 2024లోనే సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. తాజాగా దాదర్‌ స్టేషన్‌ పేరు మార్పు నిర్ణయం కూడా ఆ జాబితాలో చేరింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్