Magazines

ప్రమాదంలో ఆదివాసీల హక్కులు

1 గంట క్రితం

Tribal
avatar
balaji

ప్రచురించబడింది నవం 20, 2026 | 2 నిమిషాల చదవడం

గిరిజనులకు వ్యతిరేకంగా పాలకుల విధానాలు

​అటవీ భూములను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే 
కొత్త చట్టాలు :ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్ 
జాతీయ చైర్మెన్ జితేంద్ర చౌదరి

​పార్లమెంటరీ కమిటీని తప్పుదోవ పట్టించిన సీఎం : 
శ్రీరాం నాయక్


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దేశవ్యాప్తంగా ఆదివాసీ గిరిజను లకు రాజ్యాంగం కల్పించిన హక్కులు గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర ప్రమాదంలో పడ్డాయని ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ చై‌ర్మెన్, మాజీ మంత్రి, త్రిపుర శాసనసభ ప్రతిపక్ష నేత జితేంద్ర చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్‌ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని 13 కోట్ల మంది ఆదివాసీలలో సగం మంది 5, 6 షెడ్యూ ల్ ప్రాంతాల్లోని అడవులనే నమ్ముకుని జీవిస్తున్నారని జితేంద్ర చౌదరి తెలి పారు. అయితే, వారికి రక్షణగా ఉన్న 1/70 చట్టం, పెసా చట్టాలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కాలరా స్తోందని విమర్శించారు.

లక్షలాది ఎకరాల గిరిజన భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకే 'అటవీ సంరక్షణ నియమాల చట్టం-2023'ను తీసుకొచ్చారని చెప్పారు. అభివృద్ధి, ప్రాజెక్టుల పేరుతో తరతరాలుగా అడవుల్లో నివసిస్తున్న కోట్లాది మందిని బలవంతంగా నిర్వాసితులను చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన విద్యావ్యవస్థను బలోపేతం చేయాల్సింది పోయి, మనువాద భావజాలాన్ని బలవంతంగా రుద్దుతూ ఆదివాసీల సంస్కృతి, ఆచారాలు, ఆహార అలవాట్లపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు దాడి చేస్తున్నాయని ఆయన విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆదివాసీలపై దాడులు, హత్యలు జరుగుతున్నాయని, ఉద్యోగాలు, ప్రమోషన్ల రిజర్వేషన్లలోనూ తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలిపారు. ఈ అన్యాయాలపై డిసెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ సమావేశాల్లో చర్చించి, భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని ప్రకటించారు. ​

రాష్ట్రంలో పర్యటిస్తున్న పార్లమెంటరీ ఎస్సీ, ఎస్టీ కమిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు సమాచారం ఇస్తున్నారని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ ‌శ్రీరాంనాయక్‌ ‌తెలిపారు. ​ రాష్ట్ర బడ్జెట్‌లో గిరిజనుల కోసం కేటాయించిన రూ. 16 వేల కోట్లలో కనీసం 2 శాతం కూడా ఖర్చు చేయకుండా నిధులను దారి మళ్లించారని విమర్శించారు.​ అధికారంలోకి రాగానే 7 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, రెండున్నరేండ్లు గడుస్తున్నా ఒక్క ఎకరాకు కూడా హక్కులు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కొందరికి నామినేటెడ్ పదవులిచ్చి గిరిజనులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఇచ్చిన హామీల అమలు కోసం కలిసొచ్చే సంఘాలతో ఐక్య ఉద్యమాలు నిర్మిస్తామని స్పష్టం చేశారు. ​విలేకర్ల సమావేశంలో ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్ మధ్యప్రదేశ్ నాయకులు రామ్ నారాయణ కురారియా, మధ్యప్రదేశ్‌ ఆదివాసీ ఉద్యమ నాయకులు లలిత ప్రసాద్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం. బాలునాయక్, హైదరాబాద్ నాయకులు ఆంగోత్ కృష్ణా నాయక్, రూప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్