ఎప్స్టీన్ ఫైల్స్‌పై కూడా... : డెమొక్రాట్ల నిర్ణయం
పత్రాలను భద్రపరచాలంటూ అధ్యక్షుడి సన్నిహితులు, బంధువులు, మాజీ సహాయకులకు లేఖలు
వాషింగ్టన్ : మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ ఉభయసభలపై పట్టు సాధించిన డెమొక్రాట్లు దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ అవినీతిని బట్టబయలు చేయాలని నిర్ణయించారు. ట్రంప్ కుటుంబంపై వచ్చిన అవినీతి ఆరోపణలు, జెఫ్రీ ఎప్‌స్టీన్స్ ఫైల్స్, ప్రభుత్వ ఇమ్మిగ్రేషన్ అణచివేత విధానాలపై ప్రణాళికాబద్ధమైన దర్యాప్తు జరుపుతామని సంకేతాలు ఇచ్చారు. హౌస్ పర్యవేక్షక కమిటీకి తదుపరి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న రాబర్ట్ గార్సియా... అధ్యక్షుడు ట్రంప్ మిత్రులు, మాజీ సహాయకులు, కుటుంబసభ్యులకు బుధవారం లేఖలు పంపారు. ట్రంప్ ప్రభుత్వ స్వార్థపూరిత వ్యవహారాలు, దుష్ప్రవర్తన, అధికార దుర్వినియోగానికి ముగింపు పలకడమే తమ లక్ష్యమని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు.
ట్రంప్ బంధువులతో పాటు వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీవెన్ మిల్లర్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచే, వైట్‌హౌస్ మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ వైల్స్ సహా పలువురికి ఈ లేఖలు పంపారు. ట్రంప్ కుటుంబం పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందిందని, అధికార దుర్వినియోగానికి పాల్పడిందని వచ్చిన ఆరోపణలకు సంబంధించిన పత్రాలను భద్రపరచాలని గార్సియా ఆ లేఖల్లో కోరారు.
కాగా అధ్యక్షభవనం ప్రతినిధి లారెన్ బిస్ ఒక ప్రకటన చేస్తూ ట్రంప్ ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అయితే డెమొక్రాట్లు బూటకపు దర్యాప్తుల జరపాలని, రాడికల్ వామపక్ష విధానాలను అనుసరించాలని అనుకుంటే అది అమెరికా ప్రజలకు వ్యతిరేకంగా పనిచేయడమే అవుతుందని చెప్పారు. కస్టడీలో మరణించిన ఆర్థికవేత్త, లైంగిక నేరాలలో దోషిగా తేలిక జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించిన ఫైల్స్‌ను ట్రంప్ ప్రభుత్వం విడుదల చేయడం, ఎప్స్టీన్ సహచరి మాక్స్‌వెల్‌ను కనీస భద్రత ఉన్న జైలుకు బదిలీ చేయడం వంటి అంశాలను కూడా ఆ లేఖల్లో ప్రస్తావించారు. విచారణకు సహకరించేందుకు ప్రభుత్వం నిరాకరిస్తే డెమొక్రాట్లు సహించబోరని గార్సియా స్పష్టం చేశారు. ఎప్స్టీన్, మాక్స్వెల్ నేరాలను కప్పిపుచ్చేందుకు సహకరించిన వ్యక్తుల నుంచి సమాచారాన్ని బలవంతంగా అయినా రాబట్టడానికి వెనుకాడబోమని తెలిపారు. ట్రంప్ కుమారులు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్, ఆయన అల్లుడు జేర్డ్ కుష్నర్, గ్రీస్‌కు రాయబారిగా పనిచేసిన గిల్‌ఫాయిల్, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం మాజీ కార్యదర్శి క్రిస్టీ నోమ్, ఆ విభాగానికి చెందిన మాజీ సీనియర్ సలహాదారు కోరీ లెవాండోస్కీలకు కూడా లేఖలు పంపారు.





కామెంట్లు (0)