కొనుగోళ్లు పెంచాలంటూ భారత్‌పై ట్రంప్ ఒత్తిడి
వెనిజులాతో పోలిస్తే బ్యారెల్‌పై 45 డాలర్లు అదనం
అమెరికా చమురు 111 డాలర్లు
న్యూఢిల్లీ: ఒకే బ్యారెల్ ముడిచమురు.. అమెరికా నుంచి కొంటే 111 డాలర్లు.. వెనిజులా నుంచి తెచ్చుకుంటే 66 డాలర్లే.. రెండింటి మధ్య ఏకంగా 45 డాలర్ల ధర వ్యత్యాసం. అయినప్పటికీ అమెరికా నుంచే మరింత చమురు కొనుగోలు చేయాలంటూ భారత్‌పై యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ వర్గాలు ఒత్తిడి పెంచుతున్నాయి. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తన భారత పర్యటనలో అమెరికా చమురు దిగుమతులను పెంచాలని డిమాండ్ చేస్తోన్నారు. దీనికి మోడీ సర్కార్ తలొగ్గితే భారత రిఫైనరీలపై తీవ్ర భారం పడనుంది. కేంద్ర కస్టమ్స్ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది ఆగస్టులో భారత్ దిగుమతి చేసుకున్న ముడిచమురులో అమెరికా చమురే అత్యంత ఖరీదైనది. సౌదీ అరేబియా చమురు బ్యారెల్‌కు 93 డాలర్లకు లభించగా, అమెరికా చమురుకు మరో 18 డాలర్లు అదనంగా చెల్లించాల్సి వచ్చింది. అంతర్జాతీయ రవాణా ఛార్జీలు భారీగా పెరగడంతో అమెరికా నుంచి చమురు కొనుగోళ్లను భారత రిఫైనరీలు తగ్గించాయి. దీంతో చమురు దిగుమతుల విషయంలో అమెరికా దౌత్యపరమైన ఒత్తిడి చేస్తోంది. ఇదే విషయమై మార్కో రూబియో భారత్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. అమెరికా చమురు ధరలు, రవాణా వ్యయాలు భారత రిఫైనరీలకు ఏమాత్రం అనుకూలంగా లేవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బ్యారెల్‌పై 21 డాలర్ల అదనపు భారం
కస్టమ్స్ శాఖ గణాంకాల ప్రకారం.. ఆగస్టులో దేశానికి దిగుమతి అయిన ముడిచమురులో అమెరికా చమురే అత్యంత ఖరీదైనది. రవాణా వ్యయాలతో కలిపి లెక్కించే భారత ముడిచమురు బాస్కెట్ (ఐసిబి) ధరతో పోలిస్తే అమెరికా చమురుకు బ్యారెల్‌పై 21 డాలర్ల అదనపు ధర చెల్లించాల్సి వచ్చింది. జులైలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. సెప్టెంబర్, అక్టోబర్‌లోనూ అధిక ధరల ధోరణి కొనసాగినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అమెరికా చమురు కొనుగోళ్లు పెంచాలన్న ట్రంప్ ఒత్తిడి ఉన్నప్పటికీ, ఆర్థికంగా గిట్టుబాటు కాకపోవడంతో భారత రిఫైనరీలు దిగుమతులను తగ్గిస్తున్నాయి. ఇతర దేశాల నుంచి లభించే తేలికపాటి ముడిచమురుతో పోలిస్తే అమెరికా చమురు పోటీతత్వ ధరకు అందుబాటులోకి రాకపోతే భారీ స్థాయిలో కొనుగోళ్లు కొనసాగించడం కష్టమని కెప్లర్ విశ్లేషకుడు సుమిత్ రిటోలియా పేర్కొన్నారు.
వెనిజులా భారీ రాయితీ
అమెరికా చమురుతో పోలిస్తే వెనిజులా ముడిచమురు భారత రిఫైనరీలకు తక్కువ ధరకు లభిస్తోంది. ఆగస్టులో వెనిజులా చమురుపై భారత ముడిచమురుతో పోలిస్తే బ్యారెల్‌కు 24 డాలర్ల తక్కువకు లభించింది. జులైలో కేవలం 5 డాలర్లు తక్కువగా లభించగా.. ఒక్క నెలలోనే డిస్కౌంట్ దాదాపు ఐదు రెట్లు పెరిగింది. జులైలో బ్యారెల్‌కు 77 డాలర్లుగా ఉన్న వెనిజులా చమురు దిగుమతి ధర ఆగస్టులో 66 డాలర్లకు తగ్గింది. తక్కువ ధరల కారణంగా వెనిజులా నుంచి భారత్‌కు చమురు దిగుమతులు పెరిగాయి. కెప్లర్ గణాంకాల ప్రకారం జులైలో రోజుకు 2.18 లక్షల బ్యారెళ్లుగా ఉన్న దిగుమతులు ఆగస్టులో 3.50 లక్షల బ్యారెళ్లకు చేరాయి. అయితే ఈ ప్రయోజనం ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌కే పరిమితం కావడం గమనార్హం.
రవాణా ఖర్చులే 30 శాతం!
పశ్చిమాసియాలో అమెరికా సృష్టించిన యుద్ధం కారణంగా అంతర్జాతీయ చమురు రవాణా వ్యయాలు అసాధారణంగా పెరిగాయి. హర్మూజ్ జలసంధి పరిసరాల్లో నెలకొన్న ఉద్రిక్తతలతో భారీ చమురు రవాణా నౌకల లభ్యత తగ్గిపోయింది. యుద్ధానికి ముందు ఫిబ్రవరిలో చమురు సరుకు మొత్తం వ్యయంలో రవాణా వాటా 5 శాతం కంటే తక్కువగా ఉండగా.. ప్రస్తుతం అది ఏకంగా 30 శాతానికి చేరినట్లు ప్రభుత్వ రంగ రిఫైనరీకి చెందిన సీనియర్ అధికారి వెల్లడించారు. ఫిబ్రవరిలో భారీ చమురు నౌకల అద్దె రోజుకు 50 వేల నుంచి లక్ష డాలర్ల మధ్య ఉండగా.. ప్రస్తుతం రోజుకు 10 లక్షల డాలర్లకు పైగా చెల్లించేందుకు కూడా రిఫైనరీలు సిద్ధపడుతున్నాయి. అయినప్పటికీ నౌకలు దొరకడం కష్టంగా మారింది. అమెరికా గల్ఫ్ తీర ప్రాంతం నుంచి భారత్‌కు చమురు తరలించేందుకు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి రావడం అదనపు భారంగా మారింది.
రష్యా చమురు చౌక..
భారత చమురు దిగుమతుల్లో సగానికి పైగా వాటా కలిగిన రష్యా, ఇరాక్ ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ ఇప్పటికీ చౌకగానే లభిస్తుంది. ఫిబ్రవరిలో ఈ రెండు దేశాల చమురు సగటు ధర బ్యారెల్‌కు 62 డాలర్లుగా ఉండగా.. ఆగస్టులో ఇరాక్ చమురు 93 డాలర్లకు, రష్యా చమురు 88 డాలర్లకు చేరింది. స్థూలంగా అంతర్జాతీయ చమురు మార్కెట్లో పెరిగిన ధరలు, రవాణా సంక్షోభం భారత రిఫైనరీలపై భారం పెంచుతున్నాయి. అమెరికా నుంచి దిగుమతులు పెంచాలన్న దౌత్యపరమైన ఒత్తిడి ఉన్నప్పటికీ తక్కువ ధరకు చమురు సమకూర్చుకోవాల్సిన ఆర్థిక అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అమెరికా చమురు ధరలు, రవాణా వ్యయాలు తగ్గకపోతే భారీ స్థాయిలో దిగుమతులు పెంచడం ఆర్థికంగా అనుకూలం కాదని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. లేదంటే యుఎస్ నుంచి అధిక ధరలకు దిగుమతి చేసుకుంటే భారత వాణిజ్య లోటు మరింత పెరగడంతో రూపాయిపై తీవ్ర ఒత్తిడి పెరగనుందని హెచ్చరిస్తున్నారు.







కామెంట్‌లు (0)