ఇంటర్నెట్ వినియోగంపై సుప్రీం కోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ను వినియోగించుకునే హక్కు పెద్దలతో పాటు పిల్లలకూ ఉందని సుప్రీం కోర్టు పేర్కొంది. వారి ప్రాథమిక హక్కును కాదని.. వయసు ఆధారంగా ఇంటర్నెట్ వినియోగం పై ఆంక్షలు విధించలేమంది. ఆ విధమైన పరిమితుల వల్ల పిల్లలు ఇంటర్నెట్ను యాక్సెస్ చేయడానికి చట్ట విరుద్ధమైన మార్గాలు అనుసరించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దానివల్ల ఆన్లైన్లో ప్రలోభాలు, బెదిరింపులు ఎదురైనా.. భయంతోవారు ఆ విషయాలను తల్లిదండ్రుల దృష్టికి తీసుకురావ డానికి కూడా సంకోచించే అవకాశం ఉందని జస్టిస్ జె.బి. పార్థీవాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిల్లల భద్రత, ఇంటర్నెట్ వినియోగ స్వేచ్ఛ ఒకదానికొకటి విరుద్ధం కాదని.. వారికి ఈ రెండింటినీ పొందే హక్కు ఉంటుందని సుప్రీం కోర్టు తెలిపింది. ఇంటర్నెట్ను సృజనాత్మక వ్యక్తీకరణ, సమాచార మార్పిడికి మార్కెట్‌గా అభివర్ణించింది. కాబట్టి ఇంటర్నెట్ సదుపాయాన్ని పూర్తిగా నిరాకరించడం సమంజసం కాదంది. అయితే, ఆన్లైన్ లైంగిక వేధింపుల నుంచి చిన్నారులను రక్షించడానికి సోషల్ మీడియా వేదికల్లో లైంగిక వేధింపుల కంటెంట్ తొలగింపుపై కఠిన నిబంధనలు అమలు చేయాలని కేంద్రానికి సూచించింది. ‘చాలా మంది పిల్లలకు, ముఖ్యంగా మారుమూల ప్రాంతాలలోని వారికి ఇంటర్నెట్ ముఖ్యమైన సమాచార వనరుగా ఉపయోగపడుతోంది. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి, ఇంటి నుంచే అనేక విషయాలు నేర్చుకోవడానికి ఆన్లైన్ వేదికలు సహాయపడతాయి. సోషల్ మీడియా సంస్థలు హానికరమైన కంటెంట్‌ను గుర్తించి దానిని తొలగించకపోవడం వల్ల ప్రస్తుతం ఇంటర్నెట్ పిల్లలకు ప్రమాదకరంగా మారింది. ఆ కారణాన్ని చూపి చిన్నారులను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం కూడా పొరపాటే అవుతుంది. కాబట్టి చిన్నారుల ఖాతాలు భద్రంగా ఉండడం కోసం యాప్‌లు ప్రత్యేకంగా ‘చైల్డ్ మోడ్’ను ప్రవేశపెడితే బాగుంటుంది. బాలలకు సంబంధించిన లైంగిక వేధింపుల కంటెంట్‌ను సోషల్ మీడియా యాప్‌ల నుంచి తొలగించడానికి కేంద్రం చర్యలు తీసుకోవాలి’ అని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.





కామెంట్లు (0)