Magazines

మణిపూర్‌లో మళ్లీ నెత్తుటేరులు

52 నిమిషాల క్రితం

Bloodshed returns to Manipur.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 2 నిమిషాల చదవడం

తొమ్మిది మంది మృతి..

14 ఇండ్లకు నిప్పు

కొండ ప్రాంతాల్లో కొనసాగుతున్న హింసాకాండ

శాంతి పునరుద్ధరణకు ప్రధాని మోడీ హామీ

క్షేత్రస్థాయిలో మాత్రం ఆగని దాడులు
ఇంఫాల్‌ : మణిపూర్‌లో శాంతి భద్రతలను పునరుద్ధరిస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ రాష్ట్రంలో హింసాకాండకు తెరపడటం లేదు. తాజాగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు జరిగిన వేర్వేరు ఘటనల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా.. నాగా, కుకీ వర్గాలకు చెందిన సుమారు 14 ఇండ్లను దుండగులు తగలబెట్టారు. కొండ ప్రాంతాల్లో కాల్పులు, దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మణిపూర్‌ ముఖ్యమంత్రి వై. ఖేమ్‌చంద్‌ సింగ్‌ ఢిల్లీలో ప్రధాని మోడీని కలిశారు. రాష్ట్రంలో శాంతి, సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు అన్ని విధాలా సహకరిస్తామని మోడీ హామీ ఇచ్చారు. అయితే, తాజా ఘటనలు రాష్ట్రంలో పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదనే ఆందోళనలను పెంచుతున్నాయి.కమ్జోంగ్‌ జిల్లాలోని చస్సాద్‌ గ్రామంలో శుక్రవారం రాత్రి డోంఖోనేయ్‌ టౌథాంగ్‌ (42) అనే కుకీ మహిళ మరణించడంతో హింస మొదలైంది. అక్రమ బంకర్లను తొలగించేందుకు మణిపూర్‌ పోలీసులు, ఇండియా రిజర్వ్‌ బెటాలియన్‌, సరిహద్దు భద్రతా దళం సంయుక్తంగా చేపట్టిన చర్యలను స్థానిక మహిళలు అడ్డుకునేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. ఈ సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపినట్టు వెల్లడించారు. గ్రామ వాలంటీర్లను ఏకపక్షంగా అరెస్టు చేసి నిర్బంధించడాన్ని నిరసిస్తూ జరిగిన ఆందోళనల సమయంలో ఇండ్లకు నిప్పంటించినట్టు స్థానిక వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో 23 ఏండ్ల మైఖేల్‌ న్గమ్మిన్లెన్‌ హాకిప్‌ అనే వ్యక్తి నాగా తిరుగుబాటుదారుల కాల్పుల్లో మరణించినట్టు కుకీ మహిళా సంఘం ఆరోపించింది. శనివారం తెల్లవారుజామున చస్సాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు నిప్పంటించేందుకు గుర్తుతెలియని వ్యక్తులు ప్రయత్నించడంతో మళ్లీ కాల్పులు జరిగాయి. ఉదయం 5 నుంచి 7 గంటల వరకు కాల్పులు కొనసాగాయి. దీంతో పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ 400 మీటర్ల పరిధిలో అధికారులు ఆంక్షలు విధించారు. నింగ్చౌ చింగ్‌డాంగ్‌ గ్రామం వద్ద ఇద్దరు నాగా గ్రామ రక్షకులు న్గచాన్సో నింగ్షెన్‌ (30), లీషిషన్‌ హుంగ్యో (50) హత్యకు గురయ్యారు. మకుయి గ్రామంలో మరో ముగ్గురు నాగా గ్రామ రక్షకులు మచుంగమ్మంగ్‌, అజిన్‌పౌ రింగ్‌కంగ్‌మై, రోబార్ట్‌ మరణించినట్టు సమాచారం. వీరిలో ఒకరిని శిరచ్ఛేదం చేసినట్టు గ్రామస్తులు ఆరోపించారు. కాల్పులు కొనసాగడంతో భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకోలేకపోయాయి. కాంగ్‌పోక్పి జిల్లాలోని టపోన్‌ గ్రామం వద్ద జరిగిన దాడిలో నాగా గ్రామ వాలంటీర్‌ మచుంగ్‌వాంగ్‌బౌ (35) మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఉఖ్రుల్‌ జిల్లాలో జాతీయ రహదారి-202పై కారులో ప్రయాణిస్తున్న సందీప్‌ రాయ్‌ (30)ను గుర్తుతెలియని సాయుధులు కాల్చిచంపారు. ఈ దాడుల వెనుక ఎవరున్నారనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదు.మరోవైపు, ముఖ్యమంత్రి ఖేమ్‌చంద్‌ సింగ్‌ రాష్ట్రంలో సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను మోడీకి వివరించారు. అన్ని విధాలా సాయం చేస్తామని మోడీ హామీ ఇచ్చారు. అయితే, వరుస హత్యలు, ఇండ్ల దహనం, కొనసాగుతున్న కాల్పులు రాష్ట్రంలో శాంతి పునరుద్ధరణ ఎంతవరకు సాధ్యమైందన్న ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. కేంద్రం హామీలకు, క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న పరిస్థితులకు మధ్య చాలా అంతరం ఉందన్న ఆందోళనలకు తాజా హింసాకాండ మరింత బలం చేకూరుస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్