ప్రపంచ ఆకలి సూచీలో భారత్ వెనుకడుగు
122 దేశాలకు గాను భారత్‌కు 100వ స్థానం
బాలల ఎదుగుదలలో ఆందోళనకర పరిస్థితి
ఐదేండ్లలోపు పిల్లల్లో 19 శాతానికి పెరిగిన పోషకాహార లోపం
2012 నుంచి తీవ్ర ఆకలి సమస్యల వర్గంలోనే దేశం
ఆకలి నిర్మూలనలో మందగించిన పురోగతి
'గ్లోబల్ హంగర్ ఇండెక్స్–2026' వెల్లడి
వర్షాభావ ముప్పుతో మరింత ఆందోళన
కేంద్రంలోని బీజేపీ సర్కారు విధానాలపై ప్రశ్నలు
న్యూఢిల్లీ : ప్రపంచంలో ఆకలి సమస్యను ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్ పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. అభివృద్ధి చెందిన భారత్ అంటూ మోడీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా.. దేశంలో ఆకలి కేకలు మాత్రం తగ్గడం లేదు. ప్రపంచ ఆకలి సూచీ (గ్లోబల్ హంగర్ ఇండెక్స్–జీహెచ్ఐ)-2026లో 122 దేశాలకు గాను భారత్ 100వ స్థానానికి పరిమితం కావడం బీజేపీ పాలనలో ఆహార భద్రత, పోషకాహార పరిస్థితులపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఆకలి నిర్మూలనలో పురోగతి మందగించడం, ఐదేండ్లలోపు పిల్లల్లో పోషకాహార లోపం తీవ్రంగా ఉండటం ప్రభుత్వ విధానాల డొల్లతనాన్ని ఎత్తిచూపుతున్నాయి.
దక్షిణాసియాలోనే అత్యధికం
2012 నుంచి భారత్ ‘తీవ్ర’ ఆకలి సమస్యల వర్గం నుంచి బయటపడలేకపోవడం మోడీ సర్కారు ప్రచారానికీ, ప్రజల వాస్తవ జీవన పరిస్థితులకూ మధ్య ఉన్న అంతరాన్ని స్పష్టం చేస్తోంది. 24.1 పాయింట్లతో భారత్ ‘తీవ్ర’ ఆకలి సమస్యల వర్గంలో కొనసాగుతోంది. జనాభాలో 9.8 శాతం మందికి సరిపడా ఆహారం అందడం లేదనీ, ఐదేండ్లలోపు పిల్లల్లో 29.3 శాతం మంది వయసుకు తగ్గ ఎత్తు పెరగడం లేదని నివేదిక వెల్లడించింది. మరోవైపు, పిల్లల్లో తక్కువ బరువుకు సంబంధించిన పోషకాహార లోపం 19 శాతానికి చేరింది. ఇది దక్షిణాసియాలోనే అత్యధికం కావడం గమనార్హం.
నాలుగు అంశాల ఆధారంగా అంచనా
ఆకలి సూచీని నాలుగు ప్రధాన అంశాల ఆధారంగా లెక్కిస్తారు. జనాభాలో సరిపడా కేలరీలు అందని వారి శాతం, ఐదేండ్లలోపు పిల్లల్లో వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం, ఎత్తుకు తగిన బరువు లేకపోవడం, ఐదేండ్లలోపు పిల్లల మరణాల రేటును పరిగణనలోకి తీసుకుంటారు. పోషకాహార లోపం, అనారోగ్యకరమైన పరిసరాలు, ఆహార కొరత పిల్లల ఆరోగ్యంపై చూపుతున్న ప్రభావాన్ని ఈ అంశాలు తెలియజేస్తాయి. వేర్వేరు సంవత్సరాల్లో వెలువడిన ఆకలి సూచీ నివేదికల స్కోర్లను నేరుగా పోల్చడం సరైంది కాదని నివేదిక స్పష్టం చేసింది. గణన పద్ధతులు, గణాంకాల్లో మార్పులు దీనికి కారణం. తాజా నివేదికలో 2000, 2006, 2012, 2018 సంవత్సరాలకు సంబంధించిన స్కోర్లను సవరించిన పద్ధతి, తాజా గణాంకాల ఆధారంగా అందించారు.
దక్షిణాసియాలోనూ తీవ్ర సమస్య
దక్షిణాసియా ఆకలి సూచీ స్కోరు 23.5గా నమోదైంది. ఈ ప్రాంతంలో పిల్లల్లో తక్కువ బరువుకు సంబంధించిన పోషకాహార లోపం 15.8 శాతంగా ఉంది. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇది అత్యధికం. కొన్ని దేశాల్లో ఇటీవలి కాలంలో ఆకలి సమస్య తగ్గుదల నిలిచిపోయింది. పాకిస్తాన్లో 2018తో పోలిస్తే పరిస్థితి దిగజారినట్టు నివేదిక పేర్కొంది. నేపాల్ గణనీయమైన పురోగతి సాధించగా, బంగ్లాదేశ్‌లోనూ పరిస్థితి మెరుగుపడుతున్నట్టు వివరించింది.
యుద్ధాలు.. ధరల పెరుగుదలతో ఆహార సంక్షోభం
ప్రపంచవ్యాప్తంగా ఆకలి సమస్య పెరగడానికి సాయుధ ఘర్షణలు ప్రధాన కారణాల్లో ఒకటిగా నివేదిక పేర్కొంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ లేనంత స్థాయికి దేశాల మధ్య, దేశాల అంతర్గత ఘర్షణలు చేరినట్టు వివరించింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్‌పై యుద్ధం కారణంగా ప్రపంచ వాణిజ్యానికి అంతరాయం ఏర్పడి ఆహార ధరలు పెరుగుతున్నాయని వివరించింది. ధరల పెరుగుదలతో పేదలు తక్కువ ధరకు లభించే, తక్కువ పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం, భోజనం మానేయడం వంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. పర్యావరణంలో మార్పులతో తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, పంట నష్టాలు ఆహార భద్రతను మరింత దెబ్బతీస్తున్నాయి. పరస్పరం ముడిపడిన సంక్షోభాలు ఆహార వ్యవస్థల తట్టుకునే సామర్థ్యాన్ని బలహీనపరుస్తున్నాయి. అంతర్జాతీయ నిధులు తగ్గడంతో ఆహార భద్రతకు అందుతున్న నిధులు 2016–17 స్థాయికి పడిపో యాయి. ఫలితంగా సహాయక కార్యక్రమాలు తగ్గడం, అత్యవసర ఆహార పంపిణీలో కోతలు విధించడం జరుగుతోందని నివేదిక వెల్లడించింది. పోషకాహార లోపం, పిల్లల మరణాలకు సంబంధించిన గణాంకాల సేకరణ నిలిచిపోతే సమస్య తీవ్రత గుర్తించడంలోనూ ఆలస్యం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
వర్షాభావ ముప్పు మరింత ఆందోళన
2018తో పోలిస్తే 31 దేశాలు తమ ఆకలి సూచీ స్కోర్లను కనీసం 10 శాతం మేర తగ్గించుకున్నాయి. ఆఫ్రికాలో ఉగాండా, టోగో గణనీయమైన పురోగతి సాధించాయి. దక్షిణాసియాలో 2000 నుంచి అత్యధిక పురోగతి సాధించిన దేశంగా నేపాల్ నిలిచింది. మరోవైపు, దక్షిణాసియాలో ఎల్‌నినో ప్రభావం పెరిగే అవకాశం, 2026లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే ముప్పును నివేదిక ప్రస్తావించింది. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం దేశంలోని వర్షాధార వ్యవసాయ భూముల్లో ఎక్కువ భాగం ఉన్న రుతుపవనాల ప్రధాన ప్రాంతంలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం 60 శాతంగా ఉంది. వర్షాలు తగ్గితే పంటల దిగుబడిపై ప్రభావం పడి ఆహార లభ్యత, ధరలు, పేదల పోషకాహార పరిస్థితులు మరింత ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆకలి సమస్యను ఎదుర్కొంటున్న భారత్‌కు ఈ పరిస్థితి మరో సవాలుగా మారనుంది.
ఆకలి తగ్గింపులో మందగించిన పురోగతి
ప్రపంచ ఆకలి సూచీని జర్మనీకి చెందిన వెల్త్హంగర్హిల్ఫ్ (డబ్ల్యూహెచ్హెచ్), ఐర్లాండ్‌కు చెందిన కన్సర్న్ వరల్డ్‌వైడ్ సంస్థలు, భాగస్వామ్య సంస్థల సహకారంతో రూపొందించాయి. దేశాల్లో ఆకలి తీవ్రతను, కాలక్రమంలో దానిలో వస్తున్న మార్పులను అంచనా వేయడానికి ఈ సూచీని ఉపయోగిస్తారు. భారత్‌లో ఆకలి తగ్గింపులో పురోగతి వేగం గణనీయంగా మందగించింది. 2018లో 25.8గా ఉన్న భారత్ స్కోరు 2026 నాటికి 24.1కి చేరింది. అంటే ఎనిమిదేండ్లలో 1.7 పాయింట్ల మేర మాత్రమే మెరుగుపడింది. దీనికి భిన్నంగా 2006 నుంచి 2012 మధ్య ఆరేండ్లలోనే 8.2 పాయింట్ల మేర పురోగతి నమోదైంది. ఆకలి నిర్మూలనలో గతంతో పోలిస్తే ప్రస్తుత పురోగతి ఎంత నెమ్మదిగా ఉందో ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి.






కామెంట్లు (0)