జలవిద్యుత్ 11 శాతం పతనం
112 ప్లాంట్లకు గరిష్ఠ ఉత్పత్తి ఆదేశాలు
కరిగిన బొగ్గు నిల్వలు..సీఈఏ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో విద్యుత్ డిమాండ్ ప్రభుత్వ అంచనాలను మించి అనుహ్యాంగా పెరిగింది. తీవ్రమైన ఎండలు, వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో విద్యుత్ డిమాండ్ అంచనాలు తలకిందులు అయ్యాయని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సిఇఎ) గణాంకాలు వెల్లడించాయి. తాము అంచనా వేసిన దానికంటే ఏకంగా 3.3 శాతం అధికంగా విద్యుత్ వినియోగం నమోదయ్యిందని సిఇఎ ఓ రిపోర్ట్‌లో తెలిపింది. సాధారణంగా స్వల్పకాలిక అంచనాల కంటే వాస్తవ డిమాండ్ తక్కువగానే ఉంటుందని.. కానీ ఈ ఏడాది ఈ అంచనా మారిపోయిందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.
దేశంలో ఇంధన అవసరాలు, ముఖ్యంగా బొగ్గు నిల్వలను ప్లాన్ చేసుకోవడానికి సిఇఎ అంచనాలనే విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, పవర్ సిస్టమ్ ఆపరేటర్లు ప్రాతిపదికగా తీసుకుంటాయి. ఈ నేపథ్యంలో డిమాండ్ అంచనాలను మించిపోవడం విద్యుత్ సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ క్రమంలో విద్యుత్ లభ్యతను పెంచేందుకు అప్రమత్తమైన కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ, అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు సుమారు 112 క్యాప్టివ్ బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలను గరిష్ట సామర్థ్యంతో నడపాలని ఆదేశాలు జారీ చేసింది. పెరిగిన డిమాండ్‌ను తట్టుకునేందుకు థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని భారీగా పెంచాలని సూచించింది. కాగా.. ఏప్రిల్ - ఆగస్టు మధ్య కాలంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి గతేడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 10 శాతం పెరిగి 5,79,869.38 మిలియన్ యూనిట్లకు చేరింది. గడిచిన మూడేళ్లలో ఇదే అత్యధిక విద్యుత్ ఉత్పత్తి కావడం విశేషం. మరోవైపు వర్షాభావ పరిస్థితుల కారణంగా రిజర్వాయర్లలో నీటిమట్టాలు పడిపోవడంతో జలవిద్యుత్ ఉత్పత్తి 11 శాతానికి పైగా తగ్గి 75,304.58 మిలియన్ యూనిట్లకు పరిమితమైంది. గతేడాది ఇదే కాలంలో 84,767.77 మిలియన్ యూనిట్ల జలవిద్యుత్ ఉత్పత్తి నమోదైంది. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో గరిష్ట డిమాండ్‌ను ఎదుర్కోవడంలో జలవిద్యుత్ కీలకపాత్ర పోషిస్తుండగా తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తోన్నాయి.
థర్మల్ విద్యుత్ ఉత్పత్తి విపరీతంగా పెరగడంతో ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయి. ఏప్రిల్ ప్రారంభంలో థర్మల్ పవర్ ప్లాంట్ల వద్ద సుమారు 55 మిలియన్ టన్నులుగా ఉన్న బొగ్గు నిల్వలు.. సెప్టెంబర్ 30 నాటికి 18.6 మిలియన్ టన్నులకు పడిపోయాయి. అంటే దాదాపు మూడింట రెండు వంతుల నిల్వలు హారతి కర్పూరంలా కరిగిపోయాయి. ఇదే పరిస్థితి కొనసాగితే దేశంలో చీకట్లు కమ్ముకోనున్నాయి. అయితే ఉత్తర, తూర్పు భారతదేశంలో సెప్టెంబర్‌లో కురిసిన వర్షాల కారణంగా డిమాండ్ కొంతమేర తగ్గుముఖం పట్టిందని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ నెలలో అంచనా వేసిన 161 బిలియన్ యూనిట్ల డిమాండ్, వర్షాల వల్ల కొంతమేర తగ్గిందని.. రానున్న రెండు మూడు నెలల్లో ఈ అంతరం సాధారణ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. అయితే ఎల్‌నినో ప్రభావంతో ఈ అంచనాలు తలకిందులయ్యే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. వచ్చే నెలల్లో డిమాండ్ మళ్లీ పెరిగితే ఇప్పటికే తగ్గిన బొగ్గు నిల్వలు విద్యుత్ ఉత్పత్తి, సరఫరాకు సవాలుగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
అమాంతం పెరిగిన కరెంట్ వినియోగం..
43 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 04, 2026 | 2 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)