జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్
జంతర్‌మంతర్ వైపు సిటిజన్ మార్చ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు ఉధృతమయ్యాయి. ఆదివారం వేలాది మంది ఇండియా గేట్ నుంచి జంతర్‌మంతర్ వైపు సిటిజన్ మార్చ్ నిర్వహించారు. ఆందోళనలను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఎఏఫ్), సీఆర్‌పీఎఫ్ బలగాలు భారీగా మోహరించి, నిరసనకారులపై తీవ్ర నిర్బంధ చర్యలకు పాల్పడ్డాయి. జంతర్‌మంతర్, ఆంధ్ర ప్రదేశ్ భవన్, అశోక్ రోడ్ పరిసరాల నుంచి వందలాది మందిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల అణచివేతకు నిరసనకారులు వెనక్కి తగ్గకుండా ఆందోళనలను కొనసాగించారు. ఉద్యమకారులతోపాటు అక్కడే ఉన్న కొందరు జర్నలిస్టులపై కూడా పోలీసులు దాడి చేసినట్లు నేతలు పేర్కొన్నారు.
మరోవైపు ఈ ఆందోళనల్ని అరికట్టేందుకు దాదాపు 5,000 మందికిపైగా పోలీసులు మోహరించారు.జ్ఞానేశ్ కుమార్ రాజీనామాతోపాటు నిరసనల సందర్భంగా మహిళా జర్నలిస్టుల పట్ల లైంగిక దురుసు తనానికి పాల్పడిన పోలీసు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ భవన్ పరిసరాల నుంచి ప్రారంభమైన సిటిజన్స్ మార్చ్‌లో వందలాది మంది పాల్గొన్నారు. సామాజిక కార్యకర్తలు, ఏఐఎస్‌ఎఫ్, ఎఐఎస్ఎ తదితర వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ మార్చ్ సాగింది.
పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను నిరసనకారులు దాటుకుని ముందుకు సాగారు. మార్చ్‌కు నాయకత్వం వహించిన యోగేంద్ర యాదవ్, ఏఐఎస్ఏ అఖిల భారత అధ్యక్షురాలు నేహా బోరాలను పోలీసులు అరెస్టు చేశారు. ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ సహా కీలక నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. మహిళా నిరసనకారులను పురుష పోలీసులు ఈడ్చుకెళ్లడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. విద్యార్థినులను పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా సీపీఐ(ఎం) సీనియర్ నాయకురాలు బృందా కరత్ అడ్డుకున్నారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల నుంచి వివిధ సంఘాల ఆధ్వర్యంలో, స్వతంత్రంగా నిరసనకారులు జంతర్‌మంతర్ కు చేరుకున్నారు. దీంతో పోలీసులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. అరెస్టు చేసిన నిరసనకారులను తరలిస్తున్న పోలీసు వాహనాలను పలుచోట్ల ఆందోళనకారులు అడ్డుకున్నారు. నిరసనకారులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులకు దాదాపు మూడు గంటల సమయం పట్టింది. అరెస్టుల కోసం బస్సులు, కార్లు సహా ప్రయివేటు వాహనాలను కూడా పోలీసులు వినియోగించారు. నేహా బోరాను పురుష పోలీసులు మాత్రమే ఉన్న ప్రయివేటు కారులో పోలీస్ స్టేషన్‌కు తరలించడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఆమెను ఎక్కడికి తీసుకెళ్లారనే విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. దీంతో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) కార్యకర్తలు సహా పలువురు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. విమర్శలు వెల్లువెత్తడంతో నరేలా ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్‌కు తరలించిన నేహా బోరాను అనంతరం విడుదల చేశారు.
మహిళా జర్నలిస్టులపై దురుసుతనానికి వ్యతిరేకంగా ఎస్‌ఎఫ్‌ఐ
నిరసనల సందర్భంగా మహిళా జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుకు వ్యతిరేకంగా ఎస్‌ఎఫ్‌ఐ కూడా ఆందోళనలో భాగమైంది. ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షుడు ఆదర్శ్ ఎం. సాజి, ప్రధాన కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్య, జాయింట్ సెక్రెటరీ ఐషీ ఘోష్ తదితరులు పార్లమెంట్ పోలీస్ స్టేషన్ ఎదుటకు చేరుకుని నిరసన తెలిపారు. జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి విభాగం ఏఎస్ఏపీ, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు కూడా ఆందోళనలకు దిగారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని దెబ్బతీసే చర్యలకు నిరసనగా, సీఈసీ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీలో నిరసనలు మరింత ఉధృతమవుతున్నాయి.
ఎస్‌ఎఫ్‌ఐ పోరాటానికి సీజేపీ మద్దతు
అక్టోబర్ 10న జంతర్‌మంతర్ వద్దకు విద్యార్థి, యువజన సంఘాల మార్చ్
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ చేపట్టిన పోరాటానికి కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మద్దతు ప్రకటించింది. యువత హక్కుల కోసం తొలి నుంచీ పోరాటాల్లో ముందుండే ఎస్‌ఎఫ్‌ఐ క్రమశిక్షణ, పోరాట పటిమను సీజేపీ ప్రశంసించింది. విద్యార్థి, యువజన సంఘాల ఆందోళనకు సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా సీజేపీ కో కన్వీనర్ సౌరవ్ దాస్ మాట్లాడుతూ ''యువతర పోరాటాల్లో తొలి రోజు నుంచీ ఎస్‌ఎఫ్‌ఐ అగ్రభాగాన ఉంది. ఆ సంఘం క్రమశిక్షణకు సాటిలేదు. మీరు లేవనెత్తిన డిమాండ్లకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది'' అని ప్రకటించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాలనే డిమాండ్‌తో వివిధ ప్రజాసంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఈ పోరాటం సాగుతోందని ఆయా సంఘాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్దకు భారీ మార్చ్ నిర్వహించాలని ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, సీజేపీ తదితర సంఘాలు నిర్ణయించాయి. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్‌తో చేపట్టనున్న ఈ ఆందోళనలో పెద్దఎత్తున విద్యార్థులు, యువత పాల్గొనాలని సంఘాలు పిలుపునిచ్చాయి.






కామెంట్‌లు (0)