Magazines

పీపుల్‌ ఎగ్నెస్ట్‌ సర్‌

1 గంట క్రితం

People Against Sir
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 2 నిమిషాల చదవడం

వామపక్షాల ఆధ్వర్యంలో విస్తృత ప్రజా వేదిక ఏర్పాటు

23న దేశవ్యాప్తంగా తొలి ఆందోళనలు


నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

పౌరుల ఓటు హక్కును హరిస్తున్నారని ఆరోపిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియకు వ్యతి రేకంగా పోరాటాన్ని ఉధృతం చేసేం దుకు వామపక్షాలు విస్తృత ప్రజా వేదికను ఏర్పాటు చేశాయి. వామపక్ష పార్టీల వర్గ, ప్రజా సంఘాలతోపాటు పౌర సంఘాలు కలిసి ‘పీపుల్‌ ఎగైనెస్ట్‌ సర్‌’ పేరుతో ఈ వేదికను ఏర్పాటు చేశాయి. బుధ‌వారం నాడిక్క‌డ హ‌రికిష‌న్ సుర్జీత్‌ భవన్‌లో జరిగిన కన్వెన్షన్‌లో తీర్మానంతో ఈ వేదిక ఏర్పాటును ఆమోదించారు. సర్‌ ప్రక్రియను రద్దు చేయడం, జ్ఞానేశ్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించి చర్యలు తీసుకోవడం ఈ వేదిక ప్రధాన డిమాండ్ గా ప్రకటించింది. సర్‌ ఆధారంగా నిర్వహించిన ఎన్నికలను రద్దు చేయాలని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉపయోగించిన ఓటర్ల జాబితానే కొనసాగించాలని, ఎన్నికల కమిషన్‌లో సంస్కరణలు చేపట్టాలని కూడా డిమాండ్‌ చేసింది. 23న దేశంలోని ప్రధాన నగరాల్లో తొలి విడత దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించింది.

బూత్‌ స్థాయి నుంచి ప్రజలను సమీకరించేలా..

సర్‌కు వ్యతిరేకంగా బూత్‌ స్థాయి నుంచి ప్రజలను సమీకరించడం ఈ వేదిక ప్రధాన లక్ష్యమని కన్వెన్షన్‌ పేర్కొంది. రాజకీయ పార్టీలతోపాటు పౌర సంఘాలు, రైతులు, వ్యవసాయ కార్మికులు, పారిశ్రామిక కార్మికులు, యువజనులు, విద్యార్థులు, మహిళలు సహా అన్ని రంగాల ప్రజలను ఐక్యంగా ఉద్యమంలోకి తీసుకు రావాలని నిర్ణయించింది. ఓటు హక్కు పరిరక్షణ కోసం విస్తృత ప్రజా ఉద్యమాన్ని నిర్మించడంపై దృష్టి సారించింది.


ఈ నెల 23న తొలి పోరాటం

సర్‌ ప్రక్రియకు వ్యతిరేకంగా ఈ నెల 23న ప్రధాన నగరాల్లో నిర్వహించే ఆందోళనలతో ఉద్యమాన్ని దేశవ్యాప్త స్థాయికి తీసుకెళ్లాలని వేదిక నిర్ణయించింది. ఓటర్ల జాబితాల్లో అర్హులైన పౌరుల పేర్లు తొలగించకుండా చూడటంతోపాటు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు పరిరక్షణ కోసం అన్ని ప్రజాస్వామిక శక్తులను ఏకం చేయాలని పిలుపునిచ్చింది.


ప్రముఖుల భాగస్వామ్యం

ఈ కన్వెన్షన్‌లో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సామాజిక కార్యకర్త, నటుడు ప్రకాశ్‌ రాజ్‌, సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేఎం) నాయకులు పి. కృష్ణప్రసాద్‌, డాక్టర్‌ సునీలం, వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌, డీవైఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షుడు ఎ.ఎ. రహీం, ప్రధాన కార్యదర్శి హిమాగ్నరాజ్‌ భట్టాచార్య, ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత జాయింట్‌ సెక్రె టరీ ఐషీఘోష్‌ తదితరులు పాల్గొన్నారు. సుమారు 250 మంది ప్రతిని ధులు హాజరై కొత్త ప్రజా వేదిక ఏర్పాటుకు మద్దతు తెలిపారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్