Magazines

మార్కెట్లలో గడ్డుకాలం

42 నిమిషాల క్రితం

Tough times
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 3 నిమిషాల చదవడం

ద్రవ్యోల్బణం, ఎల్‌నినో, యుద్ధ ఉద్రిక్తతల ఎఫెక్ట్‌
నిఫ్టీ 22 వేల స్థాయికి పడిపోవచ్చు
ఆరు వారాల్లోనే 8.2 శాతం క్షీణత
పీఎల్‌ క్యాపిటల్‌ రిపోర్ట్‌


ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్లకు మరిన్ని గడ్డురోజులు ఎదురుకానున్నాయని ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ పీఎల్‌ క్యాపిటల్‌ హెచ్చరించింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఇరాన్‌–అమెరికా యుద్ధ ఉద్రిక్తతలు, అధిక వడ్డీ రేట్లు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ నేపథ్యంలో నిఫ్టీ సూచీ 22,044 స్థాయికి పడిపోయే ప్రమాదం ఉందని అంచనా వేసింది. ఇప్పటికే గత ఆరు వారాల్లో నిఫ్టీ 8.2 శాతం క్షీణించగా.. ఈ ఏడాది ప్రారంభం నుంచి 6 శాతం నష్టపోయింది. మార్కెట్లు స్థిరపడటానికి ముందు మరింత పతనం తప్పకపోవచ్చని.. ఇప్పట్లో ‘వి’ ఆకారంలో వేగవంతమైన రికవరీకి అవకాశాలు తక్కువగా ఉన్నాయని స్పష్టం చేసింది. అయితే సాధారణ పరిస్థితుల్లో 12 నెలల నిఫ్టీ లక్ష్యాన్ని 27,589గా నిర్ణయించింది. బుధవారం విడుదల చేసిన ‘ది పర్ఫెక్ట్‌ స్టార్మ్‌’ నివేదికలో మార్కెట్లను చుట్టుముడుతున్న ప్రతికూల పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు దేశంలో వర్షపాతం 13 శాతం తగ్గడం, జలాశయాల్లో నీటి నిల్వలు గతేడాది కంటే 21 శాతం పడిపోవడం వ్యవసాయ రంగానికి ముప్పుగా మారాయని పేర్కొంది. దేశ భౌగోళిక విస్తీర్ణంలో 42 శాతం ప్రాంతాలు వర్షపాతం లోటును ఎదుర్కొంటున్నాయని వెల్లడించింది. తీవ్రమైన ఎల్‌నినో ప్రభావంతో రబీ పంటల దిగుబడి తగ్గి, ఆహార ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే ఆర్‌బీఐ రెపో రేటును 5.50 శాతానికి పెంచగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 5.2 శాతానికి, మూడో త్రైమాసికంలో 6 శాతానికి చేరవచ్చని అంచనాలున్నాయి.

అధిక ధరలు, పెరుగుతున్న రుణ వ్యయాలతో ప్రజల కొనుగోలు శక్తి క్షీణించి, పండగల తర్వాత వినియోగం మరింత మందగించే అవకాశం ఉందని తెలిపింది. ముడి చమురు ధరల పెరుగుదల, అంతర్జాతీయ బాండ్‌ రాబడులు ఒత్తిడి విదేశీ మదుపర్ల అమ్మకాలను మరింత పెంచవచ్చని హెచ్చరించింది. ఈ ప్రతికూలతలు కార్పొరేట్‌ కంపెనీల లాభాలపైనా ప్రభావం చూపుతున్నాయని పీఎల్‌ క్యాపిటల్‌ పేర్కొంది. మొత్తం 27 పరిశ్రమ విభాగాల్లో 16 విభాగాలు నిర్వహణ లాభాల మార్జిన్ల క్షీణతను ఎదుర్కొంటున్నాయని వెల్లడించింది. చమురు, గ్యాస్‌ రంగాలను మినహాయిస్తే రెండో త్రైమాసికంలో అమ్మకాలు 16.2 శాతం పెరిగినా, నిర్వహణ లాభాల వృద్ధి 14.7 శాతానికే పరిమితం కావచ్చని అంచనా వేసింది. ముడి పదార్థాల ధరలు, నిర్వహణ వ్యయాలు పెరగడం కంపెనీల లాభదాయకతను దెబ్బతీస్తున్నాయని తెలిపింది. కంపెనీల ఆదాయ అంచనాల్లో మరిన్ని కోతలు పడే ప్రమాదం ఉందని, మార్కెట్‌ విలువలు తగ్గినంత మాత్రాన షేర్లు వెంటనే పుంజుకుంటాయని భావించలేమని హెచ్చరించింది. దేశీయ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి, అంతర్జాతీయ ప్రతికూలతలు కొనసాగితే స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి మరింత తీవ్రమయ్యే అవకాశముందని పీఎల్‌ క్యాపిటల్‌ విశ్లేషించింది.

‘భారతీయ ఈక్విటీ మార్కెట్లు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ అనిశ్చితి, కఠినతరమవుతున్న ఆర్థిక పరిస్థితులు వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. దేశీయ ఆర్థిక కార్యకలాపాలు, కార్పొరేట్ డిమాండ్ స్థిరంగా ఉన్నప్పటికీ, సాధారణం కంటే తక్కువ రుతుపవన వర్షపాతం, అత్యంత బలమైన ఎల్ నినో ఏర్పడే అవకాశం, అధిక కమోడిటీ ధరల ప్రభావం రాబోయే త్రైమాసికాల్లో వినియోగం, కంపెనీల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. ప్రపంచవ్యాప్తంగా బాండ్ ఈల్డ్స్ పెరగడం, డాలర్‌తో పోలిస్తే సాపేక్షంగా తక్కువ రాబడులు ఉండటం కూడా విదేశీ పెట్టుబడుల ప్రవాహాలను పరిమితం చేసే అవకాశం ఉంది. ఇటీవలి మార్కెట్ దిద్దుబాటు తర్వాత విలువల పరంగా షేర్లు మరింత ఆకర్షణీయంగా మారినప్పటికీ, వి-ఆకారంలో వేగవంతమైన మార్కెట్ రికవరీని మేము ఆశించడం లేదు. మార్కెట్లు స్థిరీకరణ దశలోకి ప్రవేశించే ముందు మరింత బలహీనతను ఎదుర్కొనే అవకాశం ఉందని భావిస్తున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు ఆచితూచి వ్యవహరించాలి. బలమైన ప్రాథమిక అంశాలు కలిగిన కంపెనీలు, దేశీయ పెట్టుబడుల మద్దతు ఉన్న రంగాలు, దీర్ఘకాలిక నిర్మాణాత్మక వృద్ధి అవకాశాలు కలిగిన వ్యాపారాలపై దృష్టి సారించాలి” అని పిఎల్‌ క్యాపిటల్‌లో ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ సహ-విభాగాధిపతి అమ్నీష్ అగర్వాల్ పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్