120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు
పలు జిల్లాలకు భారీ నుంచి అతిభారీ వర్షాలు
విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడి
రైలు, విమాన సర్వీసులు రద్దు
అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురసు’ తీవ్ర తుపాను వేగంగా తీర ప్రాంతం వైపు కదులు తోందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. సోమవారం రాత్రికి గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పయని స్తున్న ఈ తీవ్ర తుపాను నెల్లూరు, కావలికి 80 కిలోమీటర్లు, ఒంగోలుకు 110 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 170 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృత మై ఉందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్‌జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళ వారం తెల్లవారుజాము మధ్య కాలంలో ఒంగోలు సమీపంలో తీరం దాటే అవ కాశం ఉందన్నారు. దీని ప్రభావంతో పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లోనూ ఇదే తరహా వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొన్నారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈదురుగాలుల కారణంగా విద్యుత్ వైర్లు తెగిపడే ప్రమాదం ఉన్నందున ప్రజలు వాటికి దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితులు మినహా ఇండ్ల నుంచి బయటకు రావద్దని, ఇంట్లోనే సురక్షితంగా ఉండాలన్నారు.
దూసుకొస్తున్న ‘మురసు’
మురసు తుపాను దూసుకొస్తుండడంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణపట్నం పోర్టులో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నెల్లూరు నగరంలో గాలులకు మహిళా పాలిటెక్నిక్ వద్ద భారీ వృక్షం నేలకొరిగింది. అక్కడే ఉన్న కారుపై ఇది పడడంతో కారు నుజ్జునుజ్జు అయింది. తుపాను కారణంగా ప్రకాశం జిల్లాకు ముప్పు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శింగరాయకొండలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కొత్తపట్నం, శింగరాయకొండ మండలం పాకల, ఊళ్లపాలెం సముద్ర తీరం వద్ద అలల ఉధృతి తీవ్రంగా ఉంది. ఊళ్లపాలెం సముద్ర తీరంలో పడవలు సముద్రపు అలల నీటిలో తేలాడుతున్నాయి. వాటిని సురక్షితంగా ఒడ్డుకు తేవడానికి మత్స్యకారులు ప్రయత్నిస్తున్నారు. పాకల సముద్ర తీరం వద్ద అలలు భారీగా ముందుకొచ్చాయి. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. పాలకొల్లు, ఆచంట, పెనుమంట్ర తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అర్నబ్ తుపాన్ తాకిడికి విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా ఇంకా పునరుద్ధరణ కాలేదు. ఈ నేపథ్యంలో మురసు తుపానుతో ఆందోళన వ్యక్తమవుతోంది.
పలాసలో 54.25 మిల్లీమీటర్ల వర్షపాతం
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, జి.సిగడాం, సారవకోట, జలుమూరు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పలాసలో అత్యధికంగా 54.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటీవల అర్నబ్ తుపానుతో కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాల్లో నీరు ఇప్పుడిప్పుడే తగ్గుతున్న క్రమంలో మళ్లీ వర్షాలతో అన్నదాతల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. విజయనగరం జిల్లాలో వర్షాలు పడ్డాయి. భారీ వర్షానికి విజయనగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తాటిపూడి రిజర్వాయర్ కు పైనుంచి నీరు ఎక్కువగా రావడంతో రెండు గేట్లు ఎత్తివేసి నీటికి దిగువకు విడుదల చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. కాకినాడలో అరగంట పాటు భారీ వర్షం కురిసింది. తునిలోనూ వర్షం పడింది. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో వర్షం కురిసింది. తిరుపతి జిల్లాలో పలు మండలాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.
పలు రైళ్లు, విమాన సర్వీసులు రద్దు
దక్షిణ కోస్తా రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. ఇండిగో సంస్థకు చెందిన పది సర్వీసులు, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కు చెందిన రెండు సర్వీసులు రద్దయ్యాయి.







కామెంట్‌లు (0)