Friday, September 26, 2025
E-PAPER
Homeజాతీయంఎర్రకోటలో కోటి విలువ చేసే క‌ల‌శం చోరీ..!

ఎర్రకోటలో కోటి విలువ చేసే క‌ల‌శం చోరీ..!

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో దొంగలుపడ్డారు… ఏకంగా కోటి రూపాయలు విలువ చేసే కలశాన్ని ఎత్తుకుపోయారు..! ఈ ఘటన ఈ నెల 2వ తేదీన జరిగిందని పోలీసులు తెలిపారు. ఎర్రకోట పార్కులో నిర్వహించిన జైన మతపరమైన ఆచారం నుండి ఒక అమూల్యమైన కలశం మాయమైంది. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కూడా ఈ మత ఆచారానికి వచ్చిన సమయంలో ఈ విషయం వెలుగుచూసింది. ఆయనను స్వాగతిస్తున్న సమయంలో … కలశం కనబడలేదు. వ్యాపారవేత్త సుధీర్‌ జైన్‌ ప్రతిరోజూ పూజ కోసం ఆ కలశాన్ని తీసుకువచ్చేవారని పోలీసులు తెలిపారు. ఢిల్లీ పోలీసుల కథనం మేరకు … కలశాన్ని దొంగిలించిన నిందితుడి కదలికలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. పోలీసులు నిందితుడిని కూడా గుర్తించారు. త్వరలోనే అరెస్టు చేసి సొత్తు స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.

మత ఆచార సమయంలో దొంగతనం ..
ఎర్రకోట సముదాయంలోని జైన సమాజం ఆధ్వర్యంలో కలశ పూజ ఆచారం ఆగస్టు 15 నుండి సెప్టెంబర్‌ 9 వరకు కొనసాగుతుంది. ఇదే అదునుగా భావించిన దొంగలు కోట్ల రూపాయల విలువైన కలశాన్ని దొంగిలించారు. ఇందుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలతో ప్రయత్నాలు ప్రారంభించారు.

దొంగతనానికి ముందు భద్రతా లోపం ..!
దొంగిలించిన కలశం చాలా విలువైనదని, దాని విలువ దాదాపు కోటి రూపాయలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. మొత్తం కలశం బంగారం, వజ్రాలతో పొదిగి ఉందని, ఇది 760 గ్రాముల బంగారంతో తయారు చేసిందని చెబుతున్నారు. కలశంపై 150 గ్రాముల వజ్రాలు, మాణిక్యాలు, పచ్చలు పొదిగి ఉన్నాయని సమాచారం. ఇంత విలువైన కలశం దొంగతనం కలకలం సృష్టించింది. దీనికి ముందు కూడా ఎర్రకోట వద్ద భద్రతా లోపం బయటపడింది. ఆగస్టు 2న, ఎర్రకోట భద్రత కోసం మోహరించిన పోలీసులు బాంబును గుర్తించలేకపోయినప్పుడు ఒక కేసు వెలుగులోకి వచ్చింది.

ఆగస్టు 2 న జరిగిన ఘటన ..!
ఢిల్లీ పోలీసుల కథనం ప్రకారం … ఆగస్టు 2న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల రిహార్స్‌లో భాగంగా మాక్‌ డ్రిల్‌ కోసం స్పెషల్‌ సెల్‌ బృందం సాధారణ దుస్తుల్లో వచ్చింది. వారు తమతో పాటు నకిలీ బాంబును తీసుకుని ఎర్రకోటలోకి ప్రవేశించారు. కానీ ఎర్రకోట భద్రత కోసం మోహరించిన పోలీసులు ఆ బాంబును గుర్తించలేకపోయారు. అప్పుడు నిర్లక్ష్యం కారణంగా పోలీసులను కూడా సస్పెండ్‌ చేశారు. ఇప్పుడు దొంగతనం సంఘటన వెలుగులోకి వచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -