Tuesday, April 29, 2025
Homeఫీచర్స్జిలిబిలి ప‌లుకుల మైనా జానకమ్మ

జిలిబిలి ప‌లుకుల మైనా జానకమ్మ

- Advertisement -

ఆమె స్వరం మృదు మధురం.. ఆమె గానం వీనుల విందు.. ఉరికే జలపాతం.. ఆమె గొంతులో సప్త స్వరాలు పలుకుతాయి. తన సుస్వరాలు పగలే వెన్నెలను కురిపిస్తాయి. తన పాటలతో ప్రేక్షకుల మనసులను నీలి మేఘాలలో తేలిపోయేలా చేస్తుంది. పక్షుల కిలకిల రావాలైన, పసిపాపల స్వరాలైన, అమ్మ పాడే లాలి పాటలైనా, ఆమె గొంతులో సరాగాలై విరబూస్తాయి. ‘సిరిమల్లె పువ్వా’ అంటూ యువతను ఉర్రూతలూగించినా, ‘సిరిమల్లె పువ్వల్లే నవ్వు’ అంటూ ప్రేక్షకులకు తీపి గాయాలు చేసినా ఆమెకే చెందుతుంది. ఆమే మన గాన కోకిల జానకమ్మ. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ, ఒరియా, ఇంగ్లీష్‌, సౌరాష్ట్ర, జర్మనీ ఇలా అనేక భాషల్లో పాటలు పాడి సంగీత ప్రియుల మనుసు దోచిన ఆమె పుట్టినరోజు సందర్భంగా….
1938 ఏప్రిల్‌ 23న గుంటూరు జిల్లా రేపల్లెలోని పాలపట్ల గ్రామంలో జానకి జన్మించారు. ఆమె తండ్రి శ్రీరామమూర్తి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు. చిన్నతనంలో కూతురు సంగీతాభిలాషను గమనించి ప్రముఖ సంగీత విద్వాంసుడు శ్రీ పైడి స్వామి దగ్గర సంగీతంలో శిక్షణ ఇప్పించారు. అప్పటినుంచి తన పదో తరగతి వరకు వివిధ సంగీత కచేరీల్లో పాడి మంచి పేరు తెచ్చుకున్నారు జానకి.
చరిత్ర సృష్టించారు
జానకి తన మూడో ఏట నుంచే అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టారు. అరవై ఏండ్లకు పైగా కొనసాగిన తన సినీ జీవితంలో దాదాపు 50000 పాటలు పాడి చరిత్ర సృష్టించారు. ప్రఖ్యాత సంగీత విద్వాంసుల వద్ద శిష్యరికం చేశారు. నాదస్వర విద్వాన్‌ పైడి స్వామి వద్ద సంగీతం నేర్చుకున్నారు. తన 19వ ఏట మామయ్య సలహా మేరకు చెన్నై లోని ఏవీఎం స్టూడియోలో పాడటం ప్రారంభించారు. దాంతో ఆమె మకాం చెన్నైకి మారింది. జానకి ఎక్కువగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో పాడారు. అయితే అచ్చ తెలుగ మ్మాయి మలయాళం, కన్నడ సినిమాల్లో ఎక్కువ పాటలు పాడడం ఓ విశేషం.
సినీ ప్రస్థానం
తొలినాళ్లల్లో ఏవీఎం స్టూడియో గాయనిగా ఉన్న ఆమె 1957లో టి.చలపతిరావు సంగీత దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం విధియిన్‌ విలాయత్తులో తన గాత్రాన్ని అందించడంతో ఆమె సినీ ప్రస్థానం మొదలైంది. ఎమ్మెల్యే చిత్రం ద్వారా తెలుగు వారికి దగ్గరయ్యారు. ఈ చిత్రంలో ఆమె పాడిన పాటకు మంచి గుర్తింపు వచ్చింది. అలా మొదలైన ఈమె గానం ఎన్నో మలుపులు తిరుగుతూ దినదిన ప్రవర్ధమానంగా సాగుతూ ఆబాల గోపాలాన్ని అలరించింది. పాటల్లో మిమిక్రీ మిక్స్‌ చేసి సంగీత ప్రపంచాన్ని మెప్పించింది. పదహారేళ్ళ వయసు చిత్రంలోని ‘కట్టుకథలు చెప్పి నేను కవ్విస్తే’ పాటలో పండు ముసలావిడ గొంతు, ‘గోవుల్లో తెల్లన గోపయ్య నల్లన’ పాటలో చిన్న పిల్లాడి గొంతు, పెద్దవాళ్ల స్వరం, ‘చిన్నారి పొన్నారి కిట్టయ్య’ పాటలో పిల్లాడి గొంతు, శ్రీవారి శోభనం చిత్రంలోని ‘అలకపానుపు ఎక్క నేల చిలిపి గోరింక’ పాటలో బామ్మ గొంతులతో పాడే పాటల వంటివి ఆమె గొంతులోని వైవిధ్యానికి ఉదాహరణలు.
సూపర్‌ మాడ్యూలేషన్‌
ఆమె స్వరం సూపర్‌ మాడ్యూలేషన్‌ శక్తికి ప్రసిద్ధి చెందింది. ఇది చిన్నపిల్లల నుండి వృద్ధ మహిళల వరకు ఎవరికైనా అనుగుణంగా ఉంటుంది. జానకి కేవలం గాయని మాత్రమే కాదు గేయ రచయిత్రి, స్వర కర్త కూడా. తమిళ, తెలుగు చిత్రాలకు కూడా అనేక పాటలు రాసారు. తన కాలంలో దాదాపు అందరూ సంగీత దర్శకులతో పనిచేశారు. ఉషా కిరణ్‌ మూవీస్‌ వారి ‘మౌన పోరాటం’ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఆమె పాడిన పాటలు దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందాయి. ‘మేఘమా దేహమా’ పాటలో ఆమె గొంతు పలికిన ఆర్ద్రత, ‘ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది’ అంటూ సాగే పాటలో ఆమె స్వరం పలికిన ప్రేమ తత్వం, ‘వెన్నెల్లో గోదావరి అందం’ పాటలో ఆమె గొంతులో పలికిన ఆవేదన, ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ అంటూ సాగే పాటలో ప్రతిఫలించిన విరహ వేదన ఆమె భావ వైవిధ్యానికి తార్కాణాలు. అలనాటి జమున నుంచి నిన్న మొన్నటి హీరోయిన్ల వరకు అయిదు తరాల కథానాయికలకి ఆమె స్వరం ఆలంబన అయ్యింది. తెర ముందు కనిపించే కథానాయికలకు ఆమె స్వరం అతికినట్టు సరిపోతుంది.
ఉత్తమ గాయనిగా…
1969లో జానకి పి.బి.శ్రీనివాస్‌తో కలిసి ఒక ఇంగ్లీష్‌ పాట పాడారు. ముఖ్యంగా ఆమె ఇళయరాజా సంగీత దర్శకత్వంలో అనేక అద్భుతమైన పాటలకు జీవం పోశారు. నిజానికి ఎమ్‌.ఎస్‌.విశ్వనాథన్‌ తొలి దశలోనే జానకితో ఎన్నో గొప్ప పాటలు తమిళంలో పాడించారు. ‘నీ లీల పాడెద దేవా’ అంటూ జానకి ఆలపించిన ఈ పాటకు ఆమెకు తెలుగులో ఎనలేని క్రేజ్‌ తీసుకొచ్చింది. ఇలా తన తియ్యటి స్వరంతో దక్షిణ భారతదేశంలో సినీ ప్రపంచానికి ఆమె అందించిన సేవలకుగాను నాలుగు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న గొప్ప గాయని జానకి. అలాగే 31 సార్లు వివిధ రాష్ట్రాల నుంచి ఉత్తమ గాయని పురస్కారాలను అందుకున్నారు. మైసూర్‌ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టర్‌ పొందారు. అలాగే తమిళనాడు ప్రభుత్వం కలయిమామని పురస్కారంతో సత్కరించింది. పద్మభూషణ్‌ అవార్డు చాలా ఆలస్యంగా వచ్చినందుకు దాన్ని తిరస్కరించిన అతి కొద్ది మందిలో ఆమె ఒకరు.
కొత్త కళాకారుల కోసం
2016 సెప్టెంబర్‌లో ఒక ప్రజా కచేరి తర్వాత ఆమె తన కెరియర్‌కు ముగింపు చెప్పారు. మైసూర్‌లోని మానస గంగోత్రి థియేటర్లో ఎస్‌ జానకి చివరిసారిగా ప్రేక్షకుల కోసం ప్రదర్శన ఇచ్చారు. అందులో ఆమెకు స్టాండింగ్‌ ఓవేషాన్‌ లభించింది. ఆమె కుమారుడు మురళీకృష్ణ కూడా ఆ సమయంలో చాలా భావోద్వేగాలకు గురయ్యారు. అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడే పదవి విరమణ చేయాలను కున్నట్లు ఆమె ఆ సందర్భంలో పంచు కున్నారు. ఎందుకంటే అనేకమంది యువ, కొత్త కళాకారులకు మార్గం సుగమం చేయ డానికే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏది ఏమైనా నేటి తరం గాయనీ మణులకు జానకమ్మ ఒక రోల్‌ మోడల్‌. ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు.
– పాలపర్తి సంధ్యారాణి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు