Friday, May 9, 2025
Homeజాతీయండ్రోన్ దాడి..జమ్మూలో ఒమర్ అబ్దుల్లా ఆకస్మిక పర్యటన

డ్రోన్ దాడి..జమ్మూలో ఒమర్ అబ్దుల్లా ఆకస్మిక పర్యటన

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : జమ్ముకశ్మీర్‌లో సరిహద్దు వెంబడి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. జమ్ము నగరం, జమ్ము డివిజన్‌లోని ఇతర ప్రాంతాలపై పాకిస్థాన్ గురువారం రాత్రి జరిపిన డ్రోన్ దాడి విఫలమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పరిస్థితిని సమీక్షించేందుకు శుక్రవారం జమ్ముకు బయలుదేరారు. “గత రాత్రి జమ్ము నగరం, డివిజన్‌లోని ఇతర ప్రాంతాలపై జరిగిన విఫలమైన పాకిస్థానీ డ్రోన్ దాడి అనంతరం పరిస్థితిని సమీక్షించేందుకు ఇప్పుడు జమ్మూకు వాహనంలో వెళ్తున్నాను” అని సీఎం తన ఎక్స్  ఖాతాలో తెలిపారు.
జమ్ము, సాంబా, ఆర్.ఎస్. పురా, ఇతర ప్రాంతాలలో పాకిస్థానీ డ్రోన్లు, తక్కువ శ్రేణి క్షిపణులను భారత బలగాలు అప్రమత్తంగా వ్యవహరించి నిర్వీర్యం చేశాయి. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సాంబా జిల్లాలో పాకిస్థాన్ సైనికుల సహకారంతో ఉగ్రవాదులు చేసిన చొరబాటు యత్నాన్ని కూడా భారత దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. “నిన్న రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు మీదుగా భారీ చొరబాటు యత్నాన్ని భగ్నం చేశాం. చొరబాటుకు యత్నించిన ఉగ్రవాదులను పాకిస్థాన్ వైపునకు తిరిగి వెళ్లేలా చేశాం” అని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
మరోవైపు, బారాముల్లా జిల్లాలోని ఉరీ సెక్టార్‌లో పౌర నివాస ప్రాంతాలపై పాకిస్థాన్ దళాలు జరిపిన భారీ మోర్టార్ కాల్పుల్లో ఒక మహిళ మరణించగా, మరో మహిళ గాయపడ్డారు. రాజేర్‌వాణి నుంచి బారాముల్లా వెళ్తున్న వాహనంపై మొహురా సమీపంలో నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) మీదుగా పాక్ దళాలు ప్రయోగించిన షెల్ తగలడంతో ఈ దుర్ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో నర్గీస్ బేగం అనే మహిళ మృతి చెందగా, హఫీజా బేగం అనే మరో మహిళ గాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -