నవతెలంగాణ-కామారెడ్డి: ప్రభుత్వ జూనియర్ కళాశాల కామారెడ్డిలో సోమవారం నిర్వహించిన జాబ్ మేళా యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించింది. ఈ జాబ్ మేళాను ఎంఎస్ఎన్ ఫార్మా, సీగా టెక్నాలజీస్ (హైదరాబాద్) కంపెనీలు సంయుక్తంగా నిర్వహించాయి.ఈ మేళాకు అధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యర్థులకు రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూలు నిర్వహించగా, సుమారు 50 మంది అభ్యర్థులు ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీకి ఎంపికయ్యారు. అదనంగా ఐటీఐ అభ్యర్థుల్లో నలుగురు ఎంపికైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, కళాశాల ప్రిన్సిపల్ జయ కుమారి, జిల్లా కలెక్టరేట్ ఐటీ అసోసియేట్ శ్రీకాంత్, ఎంఎస్ఎన్ ఫార్మా హెచ్‌ఆర్ సీతారాం, శిరీష, రవి, కళాశాల సిబ్బంది సంతోష్ రెడ్డి, సాయినాథ్, ప్రవీణ్, యోగిత తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హెచ్‌ఆర్ సీతారాం మాట్లాడుతూ, ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ శిక్షణతో పాటు టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ( టీఐఎస్ఎస్ ) సహకారంతో డిగ్రీ విద్యను అందించనున్నట్లు తెలిపారు. అలాగే ఉచిత హాస్టల్ వసతి కల్పిస్తామని చెప్పారు. శ్రీకాంత్ మాట్లాడుతూ, ఎంఫీసీ చదివి ఈఏపీసెట్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఉచిత ఇంజనీరింగ్ విద్యతో పాటు హాస్టల్ వసతి కల్పించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని జాబ్ మేళాలను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తామని చెప్పారు. కళాశాల ప్రిన్సిపల్ జయ కుమారి మాట్లాడుతూ, నిరుద్యోగ యువతకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు తమ కళాశాల ముందంజలో ఉంటుందని, రాబోయే విద్యా సంవత్సరంలో విద్యార్థులకు స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్ మరియు డిజిటల్ బోధనపై ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం అభ్యర్థులను ఉద్దేశించి, నైపుణ్యాలను పెంపొందించుకొని మంచి ఉద్యోగాలు సాధించాలని సూచిస్తూ కార్యక్రమాన్ని ముగించారు.



