– సింగరేణి యాజమాన్యం అంగీకారం
నవతెలంగాణ – గోదావరిఖని
సింగరేణిలో గతంలో వివిధ కారణాలతో తొలగించబడిన 43 మంది జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ(జేఎంఈటీ) ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి యాజమాన్యం సూత్రప్రాయంగా అంగీకరించింది. గురువారం హైదరాబాద్ విద్యానగర్‌లోని డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ కార్యాలయంలో గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్, యాజమాన్యానికి మధ్య ఈ ఒప్పందం కుదిరింది. గతంలో ఈ జేఎంఈటీలు విధులకు గైర్హాజరు కావడం, అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించకపోవడం వంటి కారణాలతో విధుల నుంచి తొలగించబడ్డారు. వీరి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించి తిరిగి ఉద్యోగాలు కల్పించాలని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం 2024 నవంబర్‌లో జరిగిన డైరెక్టర్(పా) స్థాయి సమావేశంలో, ఈ ఏడాది మార్చిలో చైర్మెన్ స్థాయిలో జరిగిన సమావేశంలోనూ అజెండా అంశంగా చేర్చి చర్చించింది. దీనిపై గత జూన్ 27న డైరెక్టర్ (పా) స్థాయిలో జరిగిన 51వ నిర్మాణాత్మక సమావేశంలో చర్చించి ద్వైపాక్షిక అంగీకారానికి వచ్చారు. యూనియన్ ప్రతినిధులు, డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో మరోమారు చర్చల అనంతరం త్రైపాక్షిక ఒప్పందానికి అంగీకరించారు. ఈ ఒప్పంద కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) డి.శ్రీనివాసులు, సింగరేణి డైరెక్టర్(పా) గౌతమ్ పొట్రు, జీఎం సిపిపి ఎ.మనోహర్, జీఎం పర్సనల్ కవితా నాయుడు, హెచ్‌ఓడి (ఎంఎస్) రవి బొజ్జా, గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కె.రాజ్ కుమార్, నాయకులు కె.వీరభద్రయ్య, ఎం.సమ్మయ్య, మద్ది ఎల్లయ్య, వైవి.రావు పాల్గొన్నారు.
43 మంది జేఎంఈటీలకు తిరిగి ఉద్యోగాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES