Thursday, September 11, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంజో బైడెన్‌ అహంకారం వల్లే త‌మ పార్టీ ఓట‌మి: కమలాహారిస్‌

జో బైడెన్‌ అహంకారం వల్లే త‌మ పార్టీ ఓట‌మి: కమలాహారిస్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ అహంకారం వల్లే 2024 అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోవడానికి కారణమని మాజీ ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ఆయన మళ్లీ పోటీ చేయాలని తీసుకున్న నిర్ణయం అత్యంత బాధ్యతారహితమైనదని ఆమె వ్యాఖ్యానించారు. ఇటీవల కమలాహారిస్‌ రాజకీయ జీవితం గురించి.. ‘107 డేస్‌’ పేరుతో తన ఆత్మకథను రాసుకున్నారు. ఈ పుస్తకంలో ఆమె అధ్యక్ష ఎన్నికల సమయంలో జరిగిన విషయాలను కూడా ఆమె ప్రస్తావించారు.

అధికారంలో ఉన్నప్పుడు జో బైడెన్‌, జిల్‌ బైడెన్‌ తీసుకున్న వ్యక్తిగత నిర్ణయాన్ని పాటించడం అవివేకమని కమలాహారిస్‌ చెప్పారు. పార్టీలో తీవ్ర చర్చ జరిగిన తర్వాతే బైడెన్‌ తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాతే తన పేరును ప్రతిపాదించారని హారిస్‌ తెలిపారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని ఆమె వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి బైడెన్‌ అహంకారం, లెక్కలేనితనమే కారణమని ఆమె ఆరోపించారు.

అయితే పోటీ నుంచి తప్పుకోమని బైడెన్‌కు సలహా ఇచ్చే పరిస్థితుల్లో అప్పుడు తాను లేనని కమలా తెలిపారు. ఒకవేళ తాను ఆ సలహా ఇచ్చి ఉంటే అది తన స్వార్థమే అవుతుందని, కేవలం అధికారం కోసం అలా చెప్పి ఉంటానని అనుకునే అవకాశం ఉంటుందని.. అందుకే తాను చెప్పలేకపోయానని ఆమె తన ఆత్మథలో చెప్పుకొచ్చారు. అధ్యక్ష పదవి అటుంచితే.. ఉపాధ్యక్షురాలిగా ఉన్నంత కాలం వైట్‌ హౌస్‌తో తన సంబంధాలు అంతంతమాత్రంగానే ఉండేవని తెలిపారు. బైడెన్‌ స్టాఫ్‌ తనను పూర్తిగా పక్కన పెట్టారని, తన ప్రాధాన్యాన్ని తగ్గించే ప్రయత్నం చేశారని కమలా హారిస్‌ ఆరోపించారు. ప్రస్తుతం కమలా వ్యాఖ్యలు ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -