– బికాస్ రంజన్ భట్టాచార్య స్థానంలో నియామకం
న్యూఢిల్లీ: సీపీఐ(ఎం) రాజ్యసభ పక్ష నేతగా జాన్ బ్రిట్టాస్ ఎంపికయ్యారు. బికాస్ రంజన్ భట్టాచార్య స్థానంలో ఆయన నియమితులయ్యారు. బ్రిట్టాస్ పేరును కేంద్ర నాయకత్వం నామినేట్ చేసిందని సీపీఐ(ఎం) వివరించింది. రాజ్యసభలో తొలి ప్రసంగంతోనే ప్రశంసలు అందుకున్న బ్రిట్టాస్.. రెండుసార్లు ‘ఉత్తమ పార్లమెంటేరియన్’గా అవార్డు పొందారు. మీడియా రంగంలో సైతం ఆయన చక్కటి ప్రతిభను ప్రదర్శించారు. మూడు దశాబ్దాలకు పైగా ప్రముఖ మీడియా వ్యక్తిగా ఆయనకు పేరున్నది. ప్రస్తుతం కైరాలి టెలివిజన్ నెట్‌వర్క్‌కు మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈయన 2021 ఏప్రిల్‌లో.. సీపీఐ(ఎం) సభ్యుడిగా రాజ్యసభకు ఎంపికయ్యారు. విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ, పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) శాఖపై సలహా కమిటీలో సభ్యుడిగా ఈయన ఉన్నారు. పార్లమెంటులోకి అడుగుపెట్టేముందు ఆయన 2016 నుంచి 2021 మధ్య కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు సలహాదారులలో ఒకరిగా పని చేశారు. బ్రిట్టాస్‌కు చురుకైన పార్లమెంటే రియన్‌గా పేరున్నది. సభ కార్యకలాపాల్లో ఆయన ఉత్సాహంగా పాల్గొంటారు. భారత న్యాయవ్యస్థ గురించి సభలో ఆయన చేసిన ప్రసంగానికి ప్రశంసలు అందాయి. ఈ ప్రసంగంపై అప్పటి ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మెన్‌గా ఉన్న వెంకయ్యనాయుడు.. బ్రిట్టాస్‌ను ప్రశంసించారు. గతేడాది ఆయనను ‘లోక్‌మత్ పార్లమెంటరీ అవార్డులు 2023’కి డాక్టర్ సుభాశ్ సి కశ్యప్, ప్రఫుల్ పటేల్‌తో కూడిన జ్యూరీ ఎంపిక చేసింది. సీతారాం ఏచూరి తర్వాత ఈ గుర్తింపును సాధించిన సీపీఐ(ఎం) రెండో ఎంపీగా బ్రిట్టాస్ నిలిచారు.
సీపీఐ(ఎం) రాజ్యసభ పక్ష నేతగా జాన్ బ్రిట్టాస్ ఎంపిక
- Advertisement -
- Advertisement -