మా పార్టీల నుంచి సభ్యుల్ని నామినేట్ చేయం
వివాదస్పద బిల్లులపై విపక్షాల స్పష్టీకరణ
ప్రతిపక్ష నేతలను వేధించడం,
ప్రాంతీయ పార్టీలపై ఒత్తిడి కోసమే బిల్లులు
తమ వైఖరిని వెల్లడించిన ఎస్పీ, ఆప్, టీఎంసీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ప్రతిపక్ష పార్టీలే లక్ష్యంగా తీసుకొచ్చిన మూడు వివాదస్పద బిల్లులపై వేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)లో చేరేందుకు ప్రతిపక్ష పార్టీలు నిరాకరించాయి. ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)లు తాము జేపీసీలో చేరబోమని ప్రకటించాయి. తమ పార్టీల తరఫున జేపీసీకి సభ్యుల్ని నామినేట్ చేయబోమని స్పష్టం చేశాయి. తీవ్రమైన నేరపూరిత కేసుల్లో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులను వారి పదవులను తొలగించేందుకు తీసుకొచ్చిన మూడు వివాదాస్పద బిల్లులను పరిశీలించడానికి లోక్‌సభ స్పీకర్ జేపీసీని వేయనున్నారు. అయితే ఈ బిల్లులను లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షపార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో ఈ బిల్లులను పరిశీలించడానికి జేపీసీ వేసేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. ఈ ప్రతిపాదిత బిల్లుల ఉద్దేశ్యం ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాల కూల్చివేత అని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
‘జేపీసీకి సభ్యులను నామినేట్ చేయం’
ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ వేసే జేపీసీలో తాము చేరబోమని ప్రతిపక్ష పార్టీలు ఒక దాని తర్వాత ఒకటి ప్రకటిస్తున్నాయి. రాజ్యాంగ 130వ సవరణ బిల్లును పరిశీలించడానికి జేపీసీకి ఏ సభ్యుడినీ నామినేట్ చేయబోమని టీఎంసీ ప్రకటించింది. ఈ కమిటీ ఒక ప్రహసనమేనని వివరించింది. టీఎంసీ రాజ్యసభ పక్షనేత డెరెక్ ఓబ్రెయిన్ మాట్లాడుతూ జేపీసీ విలువలేనిదని అన్నారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుకు మోడీ సంకీర్ణం చేస్తున్న సాహసయాత్రను మరిన్ని పార్టీలు విమర్శిస్తున్నాయన్నారు. ఆప్ రాజ్యసభ పక్షనేత సంజరు సింగ్ మాట్లాడుతూ జేపీసీకి సభ్యులను నామినేట్ చేయకూడదని తమ పార్టీ నిర్ణయించిందని తెలిపారు. అవినీతి పరుడు అవినీతికి వ్యతిరేకంగా బిల్లును ఎలా తీసుకురాగలడని ప్రశ్నించారు. నకిలీ కేసుల్లో ప్రతిపక్ష నేతలను జైలులో పెట్టడం, ప్రభుత్వాలను కూల్చడమే ఈ బిల్లు లక్ష్యమని విమర్శించారు. జేపీసీకి ఏ సభ్యుడినీ నామినేట్ చేసే అవకాశం లేదని సమాజ్‌వాదీ పార్టీ తెలిపింది.
ప్రతిపక్షాలే లక్ష్యంగా ఈ బిల్లులు : అఖిలేశ్ యాదవ్
ప్రతిపక్షాలే టార్గెట్‌గా ఈ బిల్లులు తీసుకొచ్చారని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు. ”బిల్లు ఆలోచన తప్పు. ఈ బిల్లును ప్రవేశపెట్టిన వ్యక్తి (హోంమంత్రి అమిత్ షా) తనపై తప్పుడు కేసులు పెట్టారని చాలాసార్లు చెప్పారు. ఎవరైనా ఎవరిపైనైనా నకిలీ కేసు పెట్టగలిగితే, ఈ బిల్లు అర్థం ఏమిటి?” అని ఆయన అన్నారు. అందుకే ఎంపీ, మాజీ మంత్రి ఆజం ఖాన్, మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతి, మాజీ ఎంపీ రమాకాంత్ యాదవ్, ఎమ్మెల్యే ఇర్ఫాన్ సోలంకి వంటి ఎస్పీ నాయకులను జైలులో పెట్టారని గుర్తు చేశారు. తమ నాయకులను ఏండ్ల తరబడి జైలుకు పంపారని, ఇది అధికార దుర్వినియోగాన్ని స్పష్టం చేస్తోందని అన్నారు. ఈ బిల్లులు దేశ సమాఖ్య నిర్మాణానికి వ్యతిరేకమని అఖిలేఖ్ ఆరోపించారు.
ఈ బిల్లులు రాజకీయ ప్రేరేపితమని ఆయన చెప్పారు. ప్రతిపక్ష నాయకులను వేధించడానికి, ప్రాంతీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావడానికి, వారిలో తిరుగుబాట్లను ప్రేరేపించడానికి మాత్రమే కేంద్రం ఈ బిల్లులను తీసుకువచ్చిందని విమర్శించారు. అలాగే ఎన్నికల సమయంలో దోపిడీకి పాల్పడి ఓట్లను ఎలా దొంగిలిస్తున్నారనే దానిపై జరుగుతున్న వాస్తవ చర్చ నుంచి దృష్టిని మళ్లించడానికి ఉద్దేశపూర్వకంగా ఈ బిల్లులను తీసుకువచ్చారని అన్నారు. అధికార పార్టీ తన సొంత నాయకులపై ఉన్న క్రిమినల్ కేసులను ఉపసంహరించుకుంటూ, ప్రత్యర్థులను అణచివేయడానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటోందని ఆయన ఆరోపించారు. ”ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తనపై ఉన్న కేసులు ఉపసంహరించుకున్నారు. ఉప ముఖ్యమంత్రిపై కూడా కేసులు ఉపసంహరించుకున్నారు. ఈ బిల్లును తీసుకువచ్చిన వ్యక్తులే అనేక చోట్ల తమపై తప్పుడు కేసులు నమోదు చేశారని అంగీకరించారు. వారిని తప్పుగా ఇరికించగలిగితే, రేపు మరొకరిని కూడా ఇరికించవచ్చు” అని చెప్పారు. ఈ బిల్లును తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, దీనిని ప్రజాస్వామ్య విలువలు, ప్రాంతీయ రాజకీయ ఉద్యమాలపై దాడిగా ఆయన పునరుద్ఘాటించారు.
మూడు బిల్లులను జేపీసీకి పంపాలన్న తీర్మానాన్ని పార్లమెంటు ఉభయసభలు ఆమోదించిన విషయం విదితమే. ఈ జేపీసీలో 21 మంది లోక్‌సభ నుంచి, పది మంది సభ్యులు రాజ్యసభ నుంచి ఉంటారు. ఈ కమిటీ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఏడాది నవంబర్ మూడోవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి.
జేపీసీలో చేరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES