నవతెలంగాణ-హైదరాబాద్: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా నడుస్తున్నాయి.యూఎస్ ట్రేడ్ డీల్, 2020లో జరిగిన చైనా-ఇండియా సరిహద్దుల వివాదంపై మాజీ ఆర్మీ చీప్ జనరల్ రాసిన పుస్తకంపై చర్చ జరగాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈక్రమంలోనే అధికార, విపక్షాల ఎంపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా రాజ్యసభలో కూడా ఎంపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే, అధికార పార్టీకి చెందిన జేపీ నడ్డాకు మధ్య వాదోపవాదాలు చేసుకున్నారు. ప్రతిపక్షాలకు ప్రజా సమస్యలపై ప్రస్తావించడానికి సమయం ఇవ్వట్లేదని ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. లోక్ సభలో రాహుల్ గాంధీకి మాట్లాడే చాన్స్ ఇవ్వట్లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సక్రమంగా లేదని, కేంద్ర తీరును ప్రశ్నించే హక్కు ప్రతిపక్షా నాయకులకు ఉంటుందని ఆయన నొక్కిచెప్పారు. కానీ బీజేపీ మాత్రం ప్రతిపక్షాల నాయకుల సభ హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. ఈక్రమంలోనే జేపీ నడ్డా జోక్యం చేసుకొని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లోక్ సభలో ప్రస్తావించిన అనవసర విషయాలపై రాజ్యసభలో లెవనెత్తకూడదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.



