నవతెలంగాణ-హైదరాబాద్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. పోలింగ్ జరగనున్న నవంబర్ 11వ తేదీన నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు, సంస్థలు, పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆమె అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
పోలింగ్‌కు ఒకరోజు ముందు, అంటే నవంబర్ 10వ తేదీన, కేవలం పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేసిన పాఠశాలలు, కార్యాలయాలకు మాత్రమే సెలవు వర్తిస్తుందని స్పష్టం చేశారు. అయితే, పోలింగ్ రోజైన నవంబర్ 11న నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని సంస్థలకు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ఆదేశించారు.
ఇక ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనున్న నవంబర్ 14వ తేదీన, కౌంటింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేసిన ప్రదేశాలకు మాత్రమే సెలవు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సెలవు దినాల్లో పనిచేసే అర్హులైన ఉద్యోగులకు పెయిడ్ హాలిడే (జీతంతో కూడిన సెలవు) మంజూరు చేయాలని యాజమాన్యాలను ఆదేశించారు. ఉప ఎన్నిక ప్రక్రియ సజావుగా సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.



