నవతెలంగాణ – హైదరాబాద్: ఉపాధి కోసం తట్టాబుట్ట సద్దుకొని వేలాది మంది భాగ్యనగరానికి తరలివస్తున్నారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలనుంచి కూడా హైదరాబాద్ కు నిత్యం తరలివస్తుంటారు. ఆయన వాళ్లకు దూరంగా ఉండి.. నెలలు, సంవత్సరాల తరబడి హైదరాబాద్ లో పని కోసం పలువురు అన్వేషణ సాగిస్తుంటారు. ఉపాధి దొరకని అభాగ్యులకు..పని దొరిగే వరకు కాస్తాంత ఉపశమనం కలిగించడానికి జీహెచ్ఎంసీ వినూత్నం ఆలోచనకు శ్రీకారం చుట్టింది. వారందరికీ పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి జీహెచ్ఎంసీ ఆశ్రయం కల్పిస్తోంది.
ఇలాంటి షెల్టర్లు జీహెచ్ఎంసీ వ్యాప్తంగా మొత్తం 18 ఉచిత షెల్టర్లు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో ప్రస్తుతం సుమారు 600 మంది ఆశ్రయం పొందుతున్నారు. నిర్వాహకులకు కేవలం ఆధార్ కార్డు చూపిస్తే చాలు భోజనంతో కూడిన వసతిని ఉచితంగా అందిస్తున్నారు. నిరుద్యోగులు, ఒత్తిడిలో ఉన్నవారికి కౌన్సెలింగ్ ఇచ్చి, వారిని వాళ్ల కాళ్ల మీద నిలబడేలా ప్రోత్సహిస్తూ వస్తున్నారు.
హైదరాబాద్ లోఈ షెల్టర్లు ఎక్కడెక్కడ ఉన్నాయంటే
ఇలాంటి షెల్టర్లు గ్రేటర్ పరిధిలో ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు బేగంపేటలో రెండు, లింగంపల్లి, అఫ్జల్‌గంజ్, యూసుఫ్‌గూడ, శేరిలింగంపల్లి, టపాచబుత్ర తదితర ప్రాంతాల్లో పురుషుల కోసం షెల్టర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఉప్పల్, దిల్సుఖ్నగర్, గోల్నాక వంటి ప్రాంతాల్లో మహిళల కోసం ప్రత్యేక షెల్టర్లు ఉన్నాయి. అలాగే అమన్ వేదిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బేగంపేటలోని అర్బన్ హోమ్‌లెస్ షెల్టర్‌లో గాయాలైన పురుషులకు ప్రత్యేక కేంద్రం అందుబాటులో ఉంది. ఇక్కడికి వారానికి మూడు రోజులు గాంధీ, ఉస్మానియా నుంచి వైద్యులు వచ్చి వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు.
ఆధార్ కార్డు లేకపోయినా ఫర్వాలేదు
ఎలాంటి గుర్తింపు కార్డు లేనివాళ్లను కూడా ఈ షెల్టర్లలో చేర్చుకుంటారు. ఇక్కడికి వచ్చిన వారు కేవలం ఆరు నెలలు మాత్రమే ఉండాలని నిబంధన ఉంది. కానీ పని దొరకని పక్షంలో మరో రెండు నెలల వరకు సడలింపు ఇస్తారు. నిర్దేశించిన రోజుల్లో షెల్టర్ నిర్వాహకులే అక్కడికి వచ్చిన వారికి ఉపాధిని చూపిస్తూ ఉంటారు. ఉదయం రోజుకో అల్పాహారంతో పాటు రాత్రి భోజనం అందిస్తారు. అలాగే ఆయా షెల్టర్లలో వంట, పరిశుభ్రత కోసం ప్రత్యేక కమిటీలు ఉన్నాయి.
ప్రత్యేక కౌన్సెలింగ్
షెల్టర్లకు వచ్చిన వారి పరిస్థితికి అనుగుణంగా వారంలో రెండుసార్లు నిర్వాహకులు కౌన్సిలింగ్ ఇస్తుంటారు. ఒంటరిగా ఉన్నా, ఒత్తిడితో బాధపడుతున్నా, అందరితో కలిసేలా గాంధీ ఆసుపత్రి వైద్యులు వచ్చి కౌన్సెలింగ్ ఇస్తుంటారు. అలాగే పుట్టినరోజు వేడుకలను కూడా జరుపుతామని నిర్వాహకులు అంటున్నారు. జాతీయ పండుగల సమయంలో ఆటల పోటీలు నిర్వహించి, వీరికి బహుమతులు కూడా ప్రధానం చేస్తారు.