Thursday, May 15, 2025
Homeజాతీయం52వ సీజేఐగా జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌

52వ సీజేఐగా జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌

- Advertisement -

– ప్రమాణం స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
– రెండో దళిత ప్రధాన న్యాయమూర్తిగా రికార్డు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌, ప్రధాని మోడీతోపాటు, కేంద్ర మంత్రులు, ఇతర అతిథులు పాల్గొన్నారు. గవాయ్‌కు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. 2019 మే 24 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఆయన అనేక రాజ్యాంగ ధర్మాసనాల్లో సభ్యుడిగా చరిత్రాత్మక తీర్పులను వెలువరించారు. సీజేఐ బీఆర్‌ గవాయ్‌ నవంబర్‌ 23న పదవీ విరమణ చేస్తారు. సీజేఐ పీఠాన్ని అధిరోహించిన రెండో దళిత వ్యక్తిగా గవాయ్‌ పేరు పొందారు. మహారాష్ట్రలోని అమరావతిలో 1960 నవంబరు 24న జన్మించిన గవాయ్‌ 1985 మార్చి 16న న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. మహారాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, మాజీ అడ్వకేట్‌ జనరల్‌ బారిస్టర్‌ రాజా భోంస్లేతో ఆయన పనిచేశారు. 1987 నుంచి 1990 వరకూ బాంబే హైకోర్టులో సొంతంగా లా ప్రాక్టీస్‌ చేశారు. 1992లో నాగపూర్‌ బెంచ్‌ అసిస్టెంట్‌ గవర్నమెంట్‌ లాయర్‌గా, అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. 2003 నవంబరు 14న బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ గవాయ్‌ 2005 నవంబరు 12న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొంది ఆ హైకోర్టు ప్రధాన ధర్మాసనం ఉన్న ముంబయితో పాటు నాగ్పుర్‌, ఔరంగాబాద్‌, పనాజీ ధర్మాసనాల్లో సేవలందించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. గత ఆరేండ్లలో జస్టిస్‌ గవాయ్‌ సుమారు 700 ధర్మాసనాల్లో భాగస్వామ్యం పంచుకొని రాజ్యాంగ, పరిపాలన, సివిల్‌, క్రిమినల్‌ చట్టాలు, వాణిజ్య వివాదాలు, ఆర్బిట్రేషన్‌, విద్యుత్తు, విద్య, పర్యావరణానికి సంబంధించిన కేసులను విచారించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన గవాయ్‌కు ముందు ఇదే సామాజిక వర్గానికి చెందిన జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్‌ 2007లో సీజేఐగా బాధ్యతలు చేపట్టారు. దీంతో సీజేఐగా జస్టిస్‌ గవాయ్‌ రెండో దళిత వ్యక్తి కాబోతున్నారు. ప్రస్తుత సీజేఐ సంజీవ్‌ ఖన్నా పదవీ విరమణ పొందడంతో ఆయన స్థానంలో జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నియామకం అయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -