నవతెలంగాణ-హైదరాబాద్ : కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు సజీవ దహనమయ్యారు. బస్సు డీజిల్ ట్యాంకర్‌ను లారీ ఢీకొట్టడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. గురువారం తెల్లవారుజామున బెంగళూరు నుంచి గోకర్ణకు వెళ్తున్న సీబర్డ్ ప్రయివేటు ట్రావెల్స్ బస్సును కంటెయినర్ లారీ ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. దీంతో బస్సులోని ప్రయాణికుల్లో కొందరు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్ ప్రాణాలతో బయటపడ్డారు.
అతివేగంగా వచ్చిన లారీ డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తోన్న ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. డీజిల్ ట్యాంక్ వద్దే లారీ ఢీకొనడంతో అది పగిలిపోయి క్షణాల్లో బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో వెనక వైపు ఉన్న ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ముందు భాగంలో కూర్చున్న ప్రయాణికులు తలుపులు పగలగొట్టుకొని ప్రాణాలు కాపాడుకున్నారు. గాయపడిన వారిని చిత్రదుర్గం, హిరియూరు, తుమకూరు, సిరా ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.



