నవతెలంగాణ-హైదరాబాద్: కరూర్ తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తును నిరాకరిస్తూ మద్రాస్ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అక్టోబర్ 10న విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం తెలిపింది. శుక్రవారం జాబితా చేయమని ధర్మాసనం ఆదేశించింది. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ బీజేపీ నేత ఉమా ఆనందన్ దాఖలు చేశారు.
కరూర్ జిల్లా వేలుసామిపురంలో టీవీకే అధ్యక్షుడు విజరు బహిరంగ ర్యాలీలో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 40మంది మరణించారు. వారిలో చాలా మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటపు చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. సిబిఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన ప్రత్యేక పిటిషన్‌ను ప్రధాన ధర్మాసనం తోసిపుచ్చింది. ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (నార్త్‌జోన్) ఆస్రాగార్గ్‌ను సిట్‌కు నేతృత్వం వహించాలని పేర్కొంది. కోర్టుకు కాలానుగుణ నివేదికలను సమర్పించాలని ఆదేశించింది.