Tuesday, May 20, 2025
Homeజాతీయంభయం గుప్పెట్లో కాశ్మీరీలు

భయం గుప్పెట్లో కాశ్మీరీలు

- Advertisement -

– భయం గుప్పెట్లో కాశ్మీరీలు
– టాటూలను తొలగించుకుంటున్న యువత
– శరీరంపై ఉన్న నినాదాలు, గుర్తులను తీయించుకుంటున్న తీరు
– ‘పహల్గాం’ పరిణామాల ప్రభావం
న్యూఢిల్లీ:
భారత్‌లోని కాశ్మీరీ యువత భయం గుప్పెట్లో బతుకుతున్నది. పహల్గాం ఉగ్రదాడి, తదనంతర పరిస్థితుల తర్వాత ఇది మరింత తీవ్రమైంది. ఉగ్రవాదులనే అనుమానంతో సాయుధ దళాల చర్యలు, హిందూత్వ శక్తుల విద్వేషపూరిత దాడులు వారిని ఆందోళనలోకి నెట్టి వేశాయి. దీంతో ఇప్పటి వరకు తమ శరీరం మీద ఉన్న పలు నినాదాలు, గుర్తులతో కూడిన టాటూలను (పచ్చబొట్లు) తొలగించుకోవటానికి అక్కడి యువత సిద్ధమవుతున్నది. ఇందుకు లేజర్‌ క్లీనిక్‌ల ముందు వారు క్యూ కడుతున్నారు. ”ఒక రోజు భద్రతా దళాలు ఒక చెక్‌పాయింట్‌ వద్ద నన్ను ఆపాయి. నా చేతిపై ఉర్దూలో రాసి ఉన్న ‘ఆజాదీ’ అనే పచ్చబొట్టును ఒక అధికారి చూశారు. అయితే, సదరు అధికారికి ఉర్దూ రాకపోవటంతో నేను అక్కడి నుంచి తప్పించుకోగలిగాను” అని కాశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చెందిన సమీర్‌ అనే వ్యక్తి తెలిపాడు. ధిక్కార స్వరానికి, బలానికి, నమ్ముకున్న సిద్ధాంతానికి గుర్తుగా ఈ పచ్చబొట్టును వేయించుకున్నట్టు చెప్పాడు. సమీర్‌లాగే పలువురు పలు రాజకీయ, భావోద్వేగ, గుర్తింపును ప్రతిబింబించే పచ్చబొట్లను తొలగించుకోవటానికి ముందుకు వస్తున్నారు. ఇలాంటి టాటూలను చూసి భద్రత దళాలు అనుమానంతో అదుపులోకి తీసుకొని ఏవైనా చర్యలు చేపట్టినా అది తమకు, తమ కుటుంబాన్ని ప్రభావితం చేస్తాయని అక్కడి యువత భయాన్ని వ్యక్తం చేస్తున్నది.
భారత్‌-పాక్‌ దేశాల మధ్య కాశ్మీర్‌ అంశం ఏండ్లుగా నడుస్తున్నది. అత్యంత సున్నితమైన ఈ అంశం విషయంలో ఈ రెండు దేశాల మధ్య గతంలో మూడు యుద్ధాలు కూడా జరిగాయి. అలాగే, గతనెలలో పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు పెరిగాయి కూడా. ఇక అప్పటి నుంచి దేశంలో భావోద్వేగ పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. దీని కారణంగా భారత్‌లోని ముస్లింలపై దాడులు అధికమయ్యాయని పలు నివేదికలు స్పష్టం చేశాయి. ఇలాంటి పరిస్థితులలో కాశ్మీరీ యువత కూడా టార్గెట్‌ అవుతున్నది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి టాటూలను తొలగించుకుంటున్న పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. పలు కారణాలు, గత పరిస్థితుల నేపథ్యంలో కాశ్మీరీ యువత గతంలో టాటూలు వేయించుకున్నది. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌తో పాటు దేశంలో మారిన పరిస్థితులు వారిని అభద్రతలోకి నెట్టాయి. ఆ పచ్చబొట్లను తీయించుకునేలా చేస్తున్నాయి. భద్రతా దళాల చర్యలే కాకుండా.. ఉద్యోగ నియామకాలకు సంబంధించిన కారణాలతోనూ ఈ టాటూలను తొలగించుకోవటానికి సిద్ధమవుతున్నట్టు ఇక్కడి యువత చెప్తున్నది.
2022లో సంచలనం రేపిన ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్దూ మూస్‌వాలా హత్య తర్వాత ఏకే-47 టాటూల ట్రెండ్‌ ఊపందుకున్నది. సిద్దూ మూస్‌వాలా ప్రభావం యువతపై ఎక్కువగా ఉన్నది. దీంతో కొందరు కాశ్మీరీ యువత కూడా ఈ టాటూ ట్రెండ్‌ను ఫాలో అయింది. అయితే, పహల్గాందాడి అనంతరం పరిస్థితులు.. గన్‌ టాటూలు వేయించుకున్న కాశ్మీరీలను ఆత్మరక్షణలో పడేశాయి. దీంతో టాటూ రీమూవల్‌ క్లీనిక్‌లకు వెళ్లి వాటిని తొలగించుకుంటున్నారు. అయితే, ఈ తొలగింపు ప్రక్రియ అంత సులువైంది కాదనీ, ఇందు కోసం పలు సార్లు క్లీనిక్‌లకు రావాల్సి ఉంటుందని టాటూ నిపుణులు ముబాషిర్‌ బషీర్‌ తెలిపాడు. ఇందుకోసం వేల రూపాయలు ఖర్చవుతాయని చెప్పాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -