– దూకుడు పెంచిన కవిత
– ఫలించని మధ్యవర్తిత్వం
– సింగరేణి జాగృతి కమిటీ ప్రకటన
– కార్యకర్తలు, నాయకుల్లో అయోమయం
– బీఆర్‌ఎస్, తెలంగాణ జాగృతి, టీజీబీకేఎస్ ఉండగా మళ్లీ కొత్త సంస్థలెందుకంటూ ఆవేదన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రోజుకో తీరుగా మారుతోన్న బీఆర్‌ఎస్ ఎపిసోడ్ల పర్వంలో తాజాగా మరో కొత్త అంకం మొదలైంది. పార్టీ అధినేత, తన తండ్రి కేసీఆర్ పంపిన మధ్యవర్తిత్వాన్ని కూడా లెక్కచేయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత… తగ్గేదేలే అంటూ అధిష్టానానికి మరో షాక్‌నిచ్చారు. గులాబీ పార్టీకి అనుసంధానంగా ఉన్న తెలంగాణ జాగృతి సంస్థకు ఇప్పటికే అధ్యక్షురాలుగా ఉన్న ఆమె… ఇప్పుడు సింగరేణి జాగృతి అనే కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మంగళ వారం హైదరాబాద్‌లోని తన నివాసంలో సంబంధిత కమిటీని, సింగరేణిలోని 11 ఏరియాలకు కో-ఆర్డినేటర్లను ప్రకటించిన కవిత… ఆ విభాగానికి చెందిన ప్రతినిధులతో సమావేశమయ్యారు. అటు బీఆర్‌ఎస్‌లోనూ, ఇటు బయటా ఇదే ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది. పార్టీతోపాటు దాని అనుబంధ సంఘాలుండగా, వాటిని కాదని కొత్త సంస్థలను ఏర్పాటు చేయటమేంటని కారు పార్టీ నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి ప్రాంతంలో బీఆర్‌ఎస్‌కు అనుంబం ధంగా ‘తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీజీబీకేఎస్)’ ఉంది. గతంలో ఇది గుర్తింపు సంఘంగా కూడా ఉంది. ఇప్పుడు దాన్ని కాదని సింగరేణి జాగృతి పేరిట మరో సంస్థను ఏర్పాటు చేయటంపై కేసీఆర్ అభిమానులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్… కవిత వద్దకు రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్‌రావు, న్యాయవాది గండ్ర మోహన్‌రావును మధ్యవర్తిత్వం కోసం పంపిన సంగతి విదితమే. సోమవారం కవిత నివాసానికి వెళ్లిన వీరు… దాదాపు రెండు గంటలపాటు పలు అంశాలపై ఆమెతో చర్చించారు. వరంగల్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ, దానిపై పాజిటివ్, నెగెటివ్ అంశాలతో కూడిన ఒక లేఖను కవిత, తన తండ్రికి రాసిన సంగతి విదితమే. అయితే ఆమె అమెరికాలో ఉన్న సమయంలో అది బహిర్గతమై పలు వివాదాలకు దారి తీసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత, ఆ లేఖను ఎవరు బహిర్గతం చేశారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. పార్టీలో కోవర్టులున్నారంటూ అదే సందర్భంలో ఆమె ఆరోపణలు గుప్పించారు. ఇలాంటి అంశాలన్నింటిపై కవితతో చర్చించిన దామోదర్‌రావు, మోహన్‌రావు… ‘తొందరపడి ఎలాంటి నిర్ణయమూ తీసుకోవద్దు…అంతర్గత విషయాలను అంతర్గతంగానే మాట్లాడు కుందాం…’ అంటూ నచ్చజెప్పారు. ఇది జరిగిన మరుసటి రోజే (మంగళవారం) కవిత… సింగరేణి జాగృతి అనే సంస్థను, దాని కమిటీలను ప్రకటించటం గమనార్హం.
కార్మికుల సంక్షేమమే లక్ష్యం : కవిత
కాగా కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా సింగరేణి జాగృతి ఆవిర్భవించిందని కవిత వ్యాఖ్యానించారు. ఆ మేరకు దాని కార్యాచరణ ఉంటుందని పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆమె మాట్లాడుతూ… తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీజీబీకేఎస్)తో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతామని తెలిపారు. సంబంధిత కమిటీల్లో యువతకు ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలతో సింగరేణిని అంతం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన విద్య, వైద్య సౌకర్యాలను అందించాలని అన్నారు. అందుకు భిన్నంగా సింగరేణి డీఎమ్‌ఎఫ్‌టీ నిధులను ప్రభుత్వం కొడంగల్, మధిర నియోజకవర్గాలకు తరలించటం శోచనీయమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి… ప్రధాని మోడీ కోసమే పని చేస్తున్నారని కవిత ఈ సందర్భంగా విమర్శించారు. అందుకే కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసే లేబర్ కోడ్‌ల గురించి సీఎం ఒక్కమాట మాట్లాడ టం లేదని వ్యాఖ్యానించారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగ నియామ కాలను జీఎం స్థాయిలో చేస్తారనీ, కానీ రేవంత్ తన పబ్లిసిటీ స్టంట్ కోసం ఉద్యోగులను ఇబ్బంది పెడుతూ హైదరాబాద్‌కు వారిని పిలిపించి అపాయిం ట్‌మెంట్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కార్మిక సమస్యల పరిష్కారం కోసం తాను స్వయంగా బొగ్గు గనులు, ఓపెన్ కాస్టుల వరకు వచ్చి కూర్చొంటానని హామీ ఇచ్చారు. సింగరేణి జాగృతికి అనుబం ధంగా మహిళల విభాగం కూడా ఏర్పాటు చేస్తామని కవిత తెలిపారు.