Wednesday, December 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపాలమూరుకు అన్యాయం చేసింది కేసీఆరే

పాలమూరుకు అన్యాయం చేసింది కేసీఆరే

- Advertisement -

బీఆర్‌ఎస్‌ వల్లే కృష్ణాలో నీటి హక్కులు కోల్పోయాం
పదేండ్లలో కాళేశ్వరానికి రూ.లక్ష కోట్లు
పాలమూరు-రంగారెడ్డికి రూ.27 వేల కోట్లా?
హరీశ్‌రావు సమాధానం చెప్పాలి : నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఉమ్మడి పాలమూరు, నల్లగొండ జిల్లాలకు అన్యాయం చేసింది కేసీఆరేనని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీఆర్‌.అంబేద్కర్‌ సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కృష్ణా జలాల విషయంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పదేండ్లలో రూ.17.72 లక్షల కోట్ల బడ్జెట్‌లో నీటి పారుదల శాఖకు రూ.1.83 లక్షల కోట్లు ఖర్చు చేశారని అన్నారు. అందులో ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్‌కే రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి, మిగతా మొత్తాన్ని రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్ట్‌లకు వ్యయం చేశారని విమర్శించారు. నీటి పారుదల ప్రాజెక్ట్‌లకు నిధుల కేటాయింపుల్లో చూపిన పక్షపాతానికి కేసీఆర్‌, హరీశ్‌రావు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రజల రక్తాన్ని తాకట్టు పెట్టి షార్ట్‌ టర్మ్‌ లోన్లు తెచ్చి కట్టిన కాళేశ్వరం కూలి పోయిందని ఎద్దేవా చేశారు. ఏటా వాటికి రూ.16 వేల కోట్లు రీపేమెంట్‌ చేస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం కాళేశ్వరం కోసమే.. పాలమూరు-రంగారెడ్డి, కోయిల సాగర్‌, నెట్టెంపాడు, భీమా డిండీ, ఎస్‌ఎల్‌బీసీ మొదలగు ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లా ప్రాజెక్ట్‌లను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. కృష్ణా నీటి వాటాల విషయంలో బీఆర్‌ఎస్‌ పదేండ్ల కాలంలో చేసిన తప్పుడు ఒప్పందాలే తెలంగాణకు మరణశాసన మయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. 34 శాతం (299 టీఎంసీలు) తెలంగాణకు, 66 శాతం (515 టీఎంసీలు) ఏపీకి కేటాయించడాన్ని రెండు అపెక్స్‌ కౌన్సిల్‌ మీటింగ్‌లతో పాటు కేఆర్‌ఎంబీ బోర్డు మీటింగుల్లో బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఒప్పుకుందని ఆరోపించారు. హరీశ్‌ చెబుతున్నట్టు పాలమూరు-రంగారెడ్డికి సంబంధించి 90 శాతం పనులు కాలేదనీ, రూ. 27 వేల కోట్లు ఖర్చు పెట్టి, 36 శాతం పనులు మాత్రమే చేశారని గుర్తు చేశారు. తాము అధికారం చేపట్టిన రెండేండ్లలో దాదాపు రూ.7వేల కోట్లు వ్యయం చేసి 67లక్షల క్యూబిక్‌ మీటర్ల ఎర్త్‌ వర్క్‌, 7లక్షల మీటర్ల కాంక్రిట్‌ వర్క్‌, 9 కిలోమీటర్ల ప్రాజెక్ట్‌ పనులు చేశామని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు పెట్టిన ఖర్చును నయాపైసాతో సహా లెక్క చెబుతామని ఉత్తమ్‌ అన్నారు.
కృష్ణా నీటి వాటాలో 71 శాతం తెలంగాణకు, 29శాతం ఏపీకి ఇవ్వాలని పోరాడు తున్నామని స్పష్టం చేశారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌లో ఏపీతో కుమ్మకై రోజుకు 3టీఎంసీ అప్ప గించారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ పనులు ఆపిం చామన్నారు. వాస్తవాలను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. హరీశ్‌రావు పేరు మార్చుకుని గోబెల్స్‌ అని పెట్టుకోవాలని సూచించారు. పాలమూరు-రంగారెడ్డి, కోయిల సాగర్‌, నెట్టెంపాడు, భీమా డిండీ, ఎస్‌ఎల్‌బీసీ మొదలగు ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లా ప్రాజెక్ట్‌లను రాబోయే మూడేండ్లలో పూర్తి చేస్తామని ఉత్తమ్‌ స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -