నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన భౌతికకాయానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. కోకాపేటలోని క్రిన్స్‌విల్లాస్‌లో ఉన్న సత్యనారాయణ రావు పార్థివ దేహానికి ఆయన పుష్పాంజలి ఘటించారు. అనంతరం హరీశ్ రావును, ఆయన తల్లి, తన ఏడో సోదరి అయిన లక్ష్మిని కేసీఆర్ పరామర్శించారు.
సత్యనారాయణ రావు, కేసీఆర్‌కు స్వయానా బావ అవుతారు. ఈ సందర్భంగా తన బావతో ఉన్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సత్యనారాయణ రావు మృతి వార్త తెలిసిన వెంటనే కేసీఆర్ ఫోన్‌లో హరీశ్ రావుతో మాట్లాడి ధైర్యం చెప్పిన విషయం తెలిసిందే. అదే విధంగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సత్యనారాయణ రావు భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కూడా సత్యనారాయణ రావుకు నివాళులర్పించి, హరీశ్ రావు కుటుంబాన్ని పరామర్శించారు.



