నవతెలంగాణ-హైదరాబాద్ : బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్‌కు గురైన తర్వాత కల్వకుంట్ల కుటుంబంలో చోటుచేసుకున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. తీవ్ర విభేదాలు నెలకొన్నాయన్న ప్రచారం నడుమ, కవిత తల్లి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సతీమణి శోభ ఆమె నివాసానికి వెళ్లడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బుధవారం రాత్రి కవిత భర్త అనిల్ కుమార్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు ఆమె వెళ్లారు.
ఈ సందర్భంగా కుమార్తె కవితతో శోభ ప్రత్యేకంగా మాట్లాడినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని రోజుల పాటు నిదానంగా వ్యవహరించాలని, కాలక్రమేణా అన్నీ సర్దుకుంటాయని కుమార్తెకు ఆమె ధైర్యం చెప్పినట్లు సమాచారం. పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన తర్వాత ఒంటరయ్యారన్న భావనలో ఉన్న కవితకు తల్లి రాక ఊరటనిచ్చిందని తెలుస్తోంది.
అయితే, కొద్ది రోజుల క్రితం జరిగిన కవిత కుమారుడి పుట్టినరోజు వేడుకకు శోభ హాజరుకాకపోవడం గమనార్హం. ఈ నెల 2న కవితపై పార్టీ వేటు వేయగా, 5వ తేదీన మనవడి పుట్టినరోజు కార్యక్రమం జరిగింది. ఆ వేడుకకు రావాల్సిందిగా కవిత ఆహ్వానించినా, శోభ దూరంగా ఉన్నారు. అయితే, మనవడి కోసం కొత్త బట్టలు, పూజా సామగ్రిని మాత్రం పంపినట్లు సమాచారం. మనవడి కార్యక్రమానికి దూరంగా ఉండి, అల్లుడి పుట్టినరోజుకు హాజరుకావడం వెనుక కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
సొంత పార్టీ నేతలైన హరీశ్‌రావు, సంతోశ్ కుమార్‌లపై కవిత తీవ్ర అవినీతి ఆరోపణలు చేయడం, వారి వల్లే కేసీఆర్‌కు చెడ్డపేరు వస్తోందని వ్యాఖ్యానించడం పార్టీలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమశిక్షణా రాహిత్యం కారణంగానే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో తల్లి శోభ ఆమెను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.