నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రధాని మోడీని కేరళ సీఎం పినరయి విజయన్ కలిశారు. ఈ భేటీలో భాగంగా ఇటీవల వైయనాడ్‌లో సంభవించిన ప్రకృతి విపత్తుపై మాట్లాడారు. కొండచరియలు విరిగిపడి వైయనాడ్‌లో అనేక ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఆ ప్రాంత పునర్ నిర్మాణం కోసం తక్షణమే NDRF గ్రాంటు విడుదల చేయాలని కోరారు. అదే విధంగా ఆ రాష్ట్రంలోని కినలూర్, కోజికోడ్ నిర్మించనున్న AIIMSకు కేంద్రం వెంటనే ఆమోదం తెలిపాలని కోరారు. అలాగే కేరళ రుణ పరిమితులపై విధించిన పరిధిని ఎత్తివేయాలన్నారు. అందుకు సంబంధించిన మెమోరాండంను సమర్పించినట్లు ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రకటించారు.
అదే విధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా కేరళ సీఎం భేటీ అయ్యారు. తీరప్రాంత భద్రత, మహిళల భద్రత, ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాలు, అత్యవసర సేవల ఆధునీకరణను పెంచాల్సిన అవసరాన్ని షా దృష్టికి తీసుకెళ్లారు. కన్నూర్, వయనాడ్‌లను LWE ప్రభావిత జిల్లాల జాబితా నుండి తొలగించాలనే నిర్ణయాన్ని సమీక్షించాలని కూడా కోరారు. అందుకు సంబంధించిన మెమోరాండంను సమర్పించినట్లు తెలియజేశారు.