నవతెలంగాణ-హైదరాబాద్: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ‘ జలమాన్ జీవన్ (వాటర్ ఈజ్ లైఫ్) ‘ ప్రచారాన్ని ప్రారంభించారు. నీటిద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం కోసం ‘హరిత కేరళమ్ మిషన్’ నేతృత్వంలో ఈ క్యాంపెయిన్‌ను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కార్యక్రమంలో భాగంగా ఆగస్ట్ 30, 31 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని బావులను క్లోరినేట్ చేయడం, ఇళ్లు మరియు నీటి ట్యాంకులను శుభ్రం చేయడం వంటి చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొంది. అలాగే పాఠశాలల్లో అవగాహన కార్యకలాపాలను చేపట్టాలని పేర్కొంది. అమీబిక్ ఎన్సెఫలిటిస్ సహా నీటిద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడంలో ఇది ప్రభావంతంగా పనిచేస్తుందని పేర్కొంది. ఈకార్యక్రమంలో ఆరోగ్యశాఖ, స్థానిక స్వపరిపాలన శాఖ, విద్యాశాఖ, హరిత కేరళం మిషన్ పాల్గొననున్నాయి.
బావులు, అపరిశుభ్రమైన నీటి ట్యాంకులలో, కలుషితమైన చెరువులు మరియు నదులలో ఈ అమీబా ఉందని అధ్యయనాలు వెల్లడించాయని తెలిపింది. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా కేరళను మార్చాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ‘వ్యర్థ రహిత నవ కేరళ’ క్యాంపెయిన్ మంచి పురోగతిని సాధించిందని పేర్కొంది. ప్రచార కార్యకలాపాల ప్రణాళికలను రూపొందించడం, వాటిని సకాలంలో అమలు చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని యంత్రాంగానికి విజయన్ సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా అమీబిక్ మెనింజోఎన్సెఫలిటిస్ (పిఎఎం) కేసులు పెరుగుతున్నందున.. నివారణ చర్యలను బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 18 పిఎఎం యాక్టివ్ కేసులు వెలుగుచూశాయి. రాజధాని తిరువనంతపురం, కొల్లామ్, కొజికోడ్, వయనాడ్ మరియు మల్లపురం జిల్లాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో మొత్తం కేసుల సంఖ్య 41కి చేరింది.