నవతెలంగాణ-హైదరాబాద్: కేరళపై ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర పరిశీలన (ఎస్‌ఐఆర్) ప్రభావం భారీగా పడింది. ఎస్‌ఐఆర్ తర్వాత సుమారు 16.54 లక్షలకు పైగా ఓటర్లను తొలగించినట్లు సిపిఐ(ఎం) ప్రతినిధి ఎం.వి.జయరాజన్ తెలిపారు. ఓట్ల తొలగింపుపై అధికారికంగా సమాచారం రావాల్సి వుంది. కేరళలో ఎస్‌ఐఆర్ తుది జాబితా శనివారం అధికారికంగా ప్రచురించబడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రధన్ యు. కేల్కర్ తెలిపారు.
తుది జాబితా ప్రకారం రాష్ట్రంలో 2.69 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు. మొత్తం 2,69,53,644 మంది ఓటర్లలో 1,38,27,319 మంది మహిళలు, 1,31,26,048 మంది పురుషులు, 277మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. 2,23,558 మంది విదేశీ ఓటర్లు, 54,110మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. కొత్త ఓటర్లు లేదా 18-19సంవత్సరాల వయస్సు గల ఓటర్ల సంఖ్య 4,24,518. 85ఏళ్ల వయస్సు పైబడిన ఓటర్లు 2,04,608మంది. విభిన్న ప్రతిభావంతులు కేటగిరీలోని ఓటర్ల సంఖ్య 2,43,698.
అయితే శనివారం ప్రచురించే ఇసిఐ జాబితాలో, 2025 డిసెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికల కోసం కేరళ రూపొదించిన ఓటర్ల జాబితా కంటే 16.54 లక్షలకు పైగా ఓటర్లు తక్కువగా ఉన్నారు. కేరళ రూపొందించిన జాబితాలో 2,86,07,658 మంది ఓటర్లు ఉన్నారు. అక్టోబర్ 2025లో స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్‌ఎస్‌ఆర్)తో నవీకరించబడిన ఓటర్ల జాబితా కంటే ఇసిఐ తుది జాబితాలో 8.97 లక్షల మంది ఓటర్లు తక్కువగా ఉన్నారు. అక్టోబర్‌లో ఇసిఐ జాబితాలో 2,78,50,855మంది ఓటర్లు ఉన్నారు. ఈ గణాంకాలను అనుసరించి అర్హత కలిగిన ఓటర్లు ఇసిఐ జాబితా నుండి తొలగించబడ్డారని స్షష్టమైందని సిపిఐ(ఎం) ప్రతినిధి ఎం.వి.జయరాజన్ తెలిపారు. గతేడాది డిసెంబర్ 23న ఇసిఐ ప్రచురించిన ముసాయిదా ఎస్‌ఐఆర్ జాబితాలో మొత్తం 2,54,42,352మంది ఓటర్లు ఉన్నారు.



