నవతెలంగాణ-హైదరాబాద్: బంగ్లాదేశ్‌లో గతేడాది జరిగిన హింసాత్మక అల్లర్ల కారణంగా మాజీ ప్రధాని షేక్ హసీనా పారిపోయి భారత్‌కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. అనంతరం మహ్మద్ యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు రప్పించాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ మేరకు పలుమార్లు భారత్‌కు లేఖ రాశారు. కానీ ఇప్పటి వరకు భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ఆమెకు సంబంధించిన వార్త మరోసారి హల్‌చల్ చేసింది. విద్యార్థులు ఉద్యమం చేస్తున్న సమయంలో వాళ్లను కాల్చి చంపేయాలని షేక్ హసీనా భద్రతా దళాలకు ఆదేశాలు ఇచ్చినట్లు బీబీసీ తన నివేదికలో పేర్కొంది.
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మరోసారి భారత్‌కు విజ్ఞప్తి చేసింది. మనస్సాక్షి ప్రకారం షేక్ హసీనాను అప్పగించాలని కొత్త అభ్యర్థన చేసింది. నైతిక విలువలకు కట్టుబడి అప్పగించాలని కోరింది. ఈమేరకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ పేరుతో ప్రెస్ సెక్రటరీ సామాజిక మాధ్యమాల్లో ఓ ప్రకటన విడుదల చేశారు.
షేక్ హసీనాను అప్పగించే విషయాన్ని సుదీర్ఘకాలం పొడిగించడం సబబు కాదని.. మానవాళిపై నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి భారత్ రక్షణ కల్పించడం భావ్యం కాదని తెలిపింది. పౌరులను ఉద్దేశపూర్వకంగా హత్య చేసిన వ్యక్తులను ఏ ప్రాంతీయ బంధం, ఏ రాజకీయ వారసత్వం కాపాడలేదని పేర్కొంది. చట్టబద్ధ పాలన, ప్రజాస్వామ్య సమగ్రత ఉమ్మడి విలువను భారత్ గౌరవించాలని.. ఎంతటి శక్తిమంతమైన నాయకులైనా చట్టానికి అతీతం కాదని, బాధితులకు న్యాయం జరగాల్సిందేనని ప్రకటనలో స్పష్టంచేశారు.
సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో పోరాడిన కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పించడంపై గతేడాది పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభమైంది. చివరకు ఈ అల్లర్లు షేక్ హసీనా పదవి నుంచి దిగిపోవడానికి కారణమైంది.