నవతెలంగాణ-హైదరాబాద్: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మానవాళికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ గురువారం అభియోగాలు మోపింది. వీటిపై ఆగస్టు 3వ తేదీన విచారణ చేపట్టనుంది. ‘‘బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, మాజీ హోం మంత్రి అసదుజ్జామన్ కాన్ కమల్, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చౌధ్రీ అబ్దుల్లా అల్ మమున్‌పై ఐసీటీ నేరాభియోగాలు మోపింది’’ అని ప్రాసిక్యూషన్ లాయర్ మీడియాకు వెల్లడించారు.
విద్యార్థుల ఆధ్వర్యంలో జులై-ఆగస్టులో జరిగిన ఉద్యమాన్ని అణచివేసేందుకు ఆమె ప్రయత్నాలు చేసినట్లు ప్రాసిక్యూటర్ వెల్లడించారు. ఉద్యమకారులను భారీ సంఖ్యలో చంపించడం, హింసించడం వంటి నేరాభియోగాలు కూడా ఆమెపై ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ విచారణకు మమున్ మాత్రమే వ్యక్తిగతంగా హాజరుకానున్నారు. ఉద్యమకారులను అణచివేయమని హసీనా ఆదేశిస్తున్నట్లు చెబుతున్న ఓ ఆడియో క్లిప్‌ను పశ్చిమ దేశాలకు చెందిన మీడియా సంస్థ వెలుగులోకి తెచ్చింది.