నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీలోని ప్రముఖ ఆశ్రమానికి చెందిన స్వామి చైతన్యానంద సరస్వతిపై లైంగికారోపణల కేసులో పోలీసుల విచారణలో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. వసంత్ కుంజ్ ప్రాంతంలోని శ్రీ శారద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ కళాశాల విద్యార్థినులను ఆయన వేధించినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే
కాలేజీలో చదువుకుంటున్న తమను స్వామి చైతన్యానంద సరస్వతి వేధించినట్టు పలువురు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. తమపై బెదిరింపులకు దిగేవారని కూడా కొందరు ఆరోపించారు. ఆగస్టులో దాఖలైన ఈ ఎఫ్‌ఐఆర్‌లో బాధితులు.. తమకు బాబా పంపిన కొన్ని వాట్సాప్ సందేశాలను కూడా పేర్కొన్నారు. బేబీ.. ఐ లవ్ వ్యూ అంటూ మెసేజీలు వచ్చాయని ఆరోపించారు. తమ రూపురేఖలు ఆహార్యంపై కామెంట్స్ చేసేవాడని అన్నారు. ఈ షాకింగ్ విషయాలు విచారణలో బయటపడ్డాయని అధికారులు ధ్రువీకరించారు.
గతేడాది అక్టోబర్‌లో తొలిసారిగా బాబాపై ఆరోపణలు మొదలయ్యాయి. గత డిసెంబర్‌లో ఓ విద్యార్థినికి ఎముక విరిగితే, ఇందుకు సంబంధించిన ఎక్స్ రే రిపోర్టు కావాలని బాబా బలవంతం చేశాడు. ఆ తరువాత అసభ్యకర మెసేజీలు కూడా పెట్టాడు. ఆ తరువాత ఈ ఏడాది మార్చ్‌లో కొత్త కారుకు పూజ పేరిట తనను పిలిపించాడని, ఆ రాత్రి తనను ఒంటరిగా కలవాలని మెసేజ్ పెట్టాడని ఆ యువతి ఆరోపించింది.
తాను చెప్పినట్టు చేయకపోతే మార్కులు తగ్గిస్తామని కూడా బాబా బెదిరింపులకు దిగాడని విద్యార్థినులు ఆరోపించారు. హోలీ సందర్భంగా మొదట తనపైనే రంగులు జల్లాలని తమను వేధించాడని అన్నారు. ఇటీవల జూన్‌లో రిషికేశ్ పర్యటన సందర్భంగా ఎప్పుడపడితే అప్పుడు తమను పిలిపించుకుని వేధించేవారని అన్నారు. ఇందుకు అంగీకరించని వారి మార్కులు తగ్గించారని, పరీక్షలు రాయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.
ఇక కాలేజీకి చెందిన శ్వేత, భావన, కాజల్ అనే సిబ్బందిపై కూడా ఓ విద్యార్థిని ఆరోపించింది. పాత మెసేజీలు డిలీట్ చేయాలని వారు తనను బలవంతం చేశారని , క్షమాపణలు చెబుతూ ఈమెయిల్ రాయాలని బలవంతం చేసినట్టు పేర్కొంది. బాబాపై మొత్తం 32 విద్యార్థినులు వాంగ్మూలాలు ఇవ్వగా వారిలో 17 మంది లైంగిక ఆరోపణలు చేశారు.