నవతెలంగాణ-హైదరాబాద్ : లక్షలాది మంది భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమానికి పోలీసులు పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు. శనివారం మధ్యాహ్నం 1:30 గంటలలోపే నిమజ్జన ప్రక్రియను పూర్తి చేసేలా స్పష్టమైన షెడ్యూల్‌ను ప్రకటించారు. బుధవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది.
భక్తుల దర్శనం కోసం నేటి అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. ఆ తర్వాత రేపు తెల్లవారుజాము నుంచే విగ్రహం వద్ద ఉన్న షెడ్డును తొలగించే పనులు మొదలుపెడతారు. అదే రోజు రాత్రి 12 గంటల తర్వాత విగ్రహాన్ని భారీ ట్రాలీపైకి చేర్చి, వెల్డింగ్ పనులు చేపడతారు. ఈ పనులన్నీ పూర్తి కాగానే శోభాయాత్రకు విగ్రహాన్ని సిద్ధం చేస్తారు.
ఈ ఏర్పాట్లపై సైఫాబాద్ ఏసీపీ సంజయ్‌కుమార్ మాట్లాడుతూ శనివారం ఉదయం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్నం 1:30 గంటల లోపు నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ ప్రణాళిక ప్రకారం, యాత్ర సజావుగా, నిర్ణీత సమయంలో ముగిసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.