నవతెలంగాణ-హైదరాబాద్: ఇవాళ దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు అంగరంగవైభవంగా ప్రారంభమైయ్యాయి. ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నప్పటికి..తొలి పూజకు గణేష్ భక్తులు సిద్ధమైయ్యారు. 69అడుగులతో రూపొందిద్దుకున్న హైదరాబాద్ లోని ఖైరతాబాద్ వినాయకుడు తొలి పూజకు అంతా సిద్ధమైంది. మూడు ముఖాలతో, పంచముఖ నాగేంద్రుడి నీడలో నిలబడి ఉన్న ఆకారంలో మట్టితో రూపొందించిన మహాగణపతి బుధవారం ఉదయం పదిన్నరకు గవర్నర్ జిష్టుదేవ్ వర్మ తొలిపూజ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఏడాది ఆపరేషన్ సిందూర్ ప్రేరణతో విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమియనున్నాడు. ఖైరతాబాద్ గణేశునికి 71 ఏళ్ల చరిత్ర ఉంది. 1954లో ఒక అడుగుతో మొదలైన ఖైరతాబాద్ వినాయకుడి ప్రస్థానం.. 60 ఏళ్ల పాటు ప్రతి ఏటా ఒక్కో అడుగు పెరుగుతూ.. ఆపై 2014 నుంచి ప్రతియేటా ఒక్కో అడుగు తగ్గిస్తూ వచ్చారు.
మహా గణపతి వద్ద పోలీసులు భారీ బందోబస్తుతో భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. 600 మంది పోలీసులతో పాటు, 60 సీసీ కెమెరాలతో భద్రతా పర్యవేక్షణ చేయనున్నారు. 100 మంది ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది, అంబులెన్సులు కూడా సిద్ధం చేశారు. సెప్టెంబర్ 6 సాయంత్రం వరకు ప్రతిరోజూ ఉదయం 6 నుండి రాత్రి 11 గంటల వరకు భక్తులు దర్శనం చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భక్తుల రద్దీని బట్టి ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్ అధికారులు అంటున్నారు.