నవతెలంగాణ-హైదరాబాద్ : ఇజ్రాయెల్ వాయుసేన ఇరాన్ నాయకత్వంపై జరిపిన తొలిదాడికి సంబంధించి మరిన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఫిబ్రవరి 28న ఆపరేషన్ లయన్స్ రోర్‌లో భాగంగా ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో ఇరాన్ తదుపరి నేతగా భావిస్తున్న ముజ్తబా హొస్సేనీ ఖమేనీ కూడా గాయపడ్డట్లు తెలుస్తోంది. ఈ దాడి నుంచి ఆయన ప్రాణాలతో బయటపడినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ కథనంలో పేర్కొంది. ఇదే ఆపరేషన్‌లో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీఖమేనీ సహా 40 మంది కీలక నాయకులు, జనరల్స్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ముజ్తబా భార్య జహ్రా కూడా మరణించారు. దాడి జరిగిన సమయంలో ముజ్తబా తన తండ్రితోపాటు ఆయతుల్లా కాంపౌండ్‌లోనే ఉన్నారా అన్న విషయంపై స్పష్టత రాలేదు. ఆయనకు అయిన గాయాల తీవ్రత కూడా తెలియరాలేదు.
ముజ్తబాకు ఇరాన్‌లోని శక్తిమంతమైన ఐఆర్‌జీసీపై బలమైన పట్టు ఉంది. దీంతో ఆయనే ఖమేనీ స్థానాన్ని భర్తీ చేస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే.. 88 మంది సభ్యులున్న గార్డియన్ కౌన్సిల్‌లో కొందరు మాత్రం అధికారాన్ని వారసత్వంగా ముజ్తబాకు అందించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ముజ్తబాకు అధికారం అప్పజెప్పడానికి అంగీకరించడం లేదు.



