Tuesday, May 6, 2025
Homeజాతీయంకుల‌గ‌ణ‌న‌పై మోడీకి ఖర్గే లేఖ

కుల‌గ‌ణ‌న‌పై మోడీకి ఖర్గే లేఖ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: దేశవ్యాప్తంగా కులగణన జరపడానికి అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరపాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మోడీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం (మే 5) మోడీకి లేఖ రాశారు. దేశంలో మొట్టమొదటిసారిగా కులగణను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. కేంద్ర హోంమంత్రిత్వశాఖ తెలంగాణ కులగణన నమూనాను అనుసరించాలని ఖర్గే లేఖలో మోడీ ప్రభుత్వాన్ని కోరారు. తుది కుల గణన నివేదికలో ఏదీ దాచిపెట్టవద్దని.. ప్రతి కులం యొక్క సామాజిక, ఆర్థిక డేటాను ప్రజలకు చేరువలో ఉంచాలి అని ఆయన మోడీ ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రిజర్వేషన్లకు సంబంధించిన విషయంపై కూడా ఖర్గే లేఖలో పేర్కొన్నారు. ఆగస్టు 1994 నుండి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్‌లో తమిళనాడు రిజర్వేషన్ల చట్టం మాత్రమే రక్షించబడింది. అదే మాదిరిగా.. ఇతర రాష్ట్రాల చట్టాలను కూడా మన రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చాలి అని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఎస్సీ,ఎస్టీ, ఓబిసి రిజర్వేషన్లలో 50 శాతం పరిమితిని కూడా రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించేందుకు కులగణన సర్వే ద్వారా స్పష్టమవుతుందని ఆయన లేఖలో తెలిపారు. ఈ కులగణన సర్వే ద్వారా ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో కూడా షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, ఒబిసిలకు రిజర్వేషన్లు కల్పించే ఆర్టికల్‌ 15(5)ను అమలు చేయాల్సిన అవసరం నెలకొంటుంది అని ఖర్గే లేఖలో పేర్కొన్నారు. ఉన్నత విద్యా శాఖకు గ్రాంట్ల డిమాండ్లపై మార్చి 25, 2025న సమర్పించిన 364వ నివేదికలో విద్య, మహిళలు, పిల్లలు, యువత, క్రీడల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఆర్టికల్‌ 15(5)ని అమలు చేయడానికి కొత్త చట్టాన్ని సిఫార్సు చేసిందని ఖర్గే పేర్కొన్నారు.
సామాజిక న్యాయం అనే అంశాన్ని లేవనెత్తినందుకు ప్రధాని మోడీ, ఆయన సహచరులు కాంగ్రెస్‌పై దాడి చేశారు. అయినప్పటికీ మన రాజ్యాంగ ప్రవేశికలో ప్రతిజ్ఞ చేసినట్లుగా ఆర్థిక న్యాయం, హోదా, అవకాశాల సమానత్వాన్ని నిర్థారించడానికి కులగణన ఖచ్చితంగా అవసరం అని ఖర్గే నొక్కి చెప్పారు. మన సమాజంలో వెనుకబడిన అణగారిన వర్గాలకు వారి హక్కులను అందించే కులగణన వంటి ప్రక్రియను నిర్వహించడం ఏవిధంగానూ విభజనగా పరిగణించకూడదు అని ఖర్గే తన లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -