నవతెలంగాణ-హైదరాబాద్: శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని(MGNREGA) పేరు మార్పుతో పాటు స్కీమ్ గా మారుస్తూ మోడీ సర్కార్ బిల్లు ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ (KMSC) బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించింది. ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చడంతో పాటు గ్రామీణ లబ్దిదారుల ఉపాధిపై తీవ్రంగా దెబ్బతీసిందని మండిపడింది. దీంతో గ్రామీణ ప్రాంతవాసులు ఉపాధి భరోసాను కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేసింది. ఆ చట్టం యొక్క నిజమైన ఆశయాలను పక్కదారి పట్టించే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకుందని విమర్శించింది. దేశంతోపాటు పంజాబ్‌లో అధిక మొత్తంలో MGNREGA ద్వారా ఉపాధి లభిస్తోందని, రాష్ట్ర వ్యాప్తంగా 20లక్షలకు పైగా జాబ్ కార్డులు జారీ చేయబడ్డాయని, 11లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారని KMSC నాయకులు మీడియాకు వెల్లడించారు.
“గ్రామాల్లో అభివృద్ధి పనులను నిర్ణయించే గ్రామసభలు, పంచాయతీల అధికారాలను కేంద్ర ప్రభుత్వం తీసివేసిందన్నారు. MGNREGA యొక్క ముఖ్య లక్షణాలలో ఒకటి, గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల స్వభావాన్ని నిర్ణయించే అధికారం గ్రామసభ, పంచాయతీలకు ఉందని, వీటిలో చెరువులను పూడిక తీయడం, కాలువలు తవ్వడం, తోటల పెంపకం, నీటిపారుదల సంబంధిత పనులు, మట్టిని నింపే పనులు వంటి కార్యకలాపాలు ఉన్నాయని తెలియజేశారు.
నిధుల నిష్పత్తిని 90:10 నుండి 60:40కి మార్చడం వల్ల రాష్ట్రాలు ఈ పథకాన్ని కొనసాగించడం అసాధ్యమని KMSC నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో MGNREGA నిధుల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం నుండి 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వాల నుండి 10 శాతం వాటా ఉండేదని గుర్తు చేశారు. ఇది ఇప్పుడు 60:40 నిష్పత్తికి సవరించబడిందని దీని వలన రాష్ట్రాలపై గణనీయంగా ఎక్కువ ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.



