– హెన్రిచ్ క్లాసెన్ అజేయ సెంచరీ
– కోల్‌కతపై సన్‌రైజర్స్ ఘన విజయం
రాయల్స్‌పై రికార్డు స్కోరుతో ఐపీఎల్18ను మొదలెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. నైట్‌రైడర్స్‌పై 278 పరుగుల రికార్డు స్కోరుతో ఘనంగా ముగించింది. హెన్రిచ్ క్లాసెన్ (105 నాటౌట్) 37 బంతుల్లోనే శతకంతో చెలరేగాడు. ట్రావిశ్ హెడ్ (76) తనదైన జోరు చూపించగా.. సన్‌రైజర్స్ తొలుత 278/3 పరుగులు చేసింది. ఛేదనలో కోల్‌కత నైట్‌రైడర్స్ 168 పరుగులకు కుప్పకూలింది. 110 పరుగులతో సన్‌రైజర్స్ అదిరే విజయంతో సీజన్‌ను ముగించింది.
నవతెలంగాణ-న్యూఢిల్లీ
ఐపీఎల్లో రికార్డు స్కోర్లకు చిరునామా సన్‌రైజర్స్ హైదరాబాద్. అభిషేక్ శర్మ, ట్రావిశ్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ ఆరెంజ్ ఆర్మీ విధ్వంసక త్రయం. గత సీజన్లో నిలకడగా మెరిసిన ఈ ముగ్గురు ఐపీఎల్18 గ్రూప్ దశ చివరి మ్యాచ్‌లో మళ్లీ మెప్పించారు. దీంతో కోల్‌కత నైట్‌రైడర్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 110 పరుగుల భారీ తేడాతో ఏకపక్ష విజయం నమోదు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (105 నాటౌట్, 39 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లు) అజేయ సెంచరీతో చెలరేగగా.. ట్రావిశ్ హెడ్ (76, 40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), అభిషేక్ శర్మ (32, 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో కదం తొక్కారు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 278 పరుగుల రికార్డు స్కోరు సాధించింది. ఛేదనలో కోల్‌కత ,నైట్‌రైడర్స్ తేలిపోయింది. మనీశ్ పాండే (37, 23 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), హర్షిత్ రానా (34, 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), సునీల్ నరైన్ (31, 16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) మినహా ఆ జట్టులో ఎవరూ రాణించలేదు. సన్‌రైజర్స్ బౌలర్లు జైదేవ్ ఉనద్కత్ (3/24), ఈషన్ మలింగ (3/31), హర్ష్ దూబె (3/34) మూడు వికెట్ల ప్రదర్శనతో నైట్‌రైడర్స్ పతనాన్ని శాసించారు. విధ్వంసక సెంచరీతో చెలరేగిన హెన్రిచ్ క్లాసెన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఈడెన్‌గార్డెన్స్‌లో కోల్‌కత చేతిలో 80 పరుగులతో ఐపీఎల్లో దారుణ ఓటమి చవిచూసిన సన్‌రైజర్స్.. ఈ సీజన్లోనే ప్రతీకారం తీర్చుకుంది. 110 పరుగుల తేడాతో కోల్‌కతను ఓడించింది. నైట్‌రైడర్స్‌కు పరంగా ఇదే అత్యంత దారుణ ఓటమి కావటం గమనార్హం.
క్లాసెన్ విశ్వరూపం
తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ రికార్డు స్కోరు సాధించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (32), ట్రావిశ్ హెడ్ (76) మరోసారి అదిరే ఆరంభం అందించారు. నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు సంధించిన అభిషేక్ శర్మ పవర్‌ప్లేలో దంచికొట్టాడు. ట్రావిశ్ హెడ్ సైతం పవర్ హిట్టింగ్తో మెరవటంతో తొలి వికెట్‌కు 6.5 ఓవర్లలోనే 92 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదైంది. 3.4 ఓవర్లలో 50 పరుగులు చేసిన సన్‌రైజర్స్..7.2 ఓవర్లలోనే 100 పరుగుల మార్క్ అందుకుంది. అభిషేక్ నిష్క్రమించినా.. ట్రావిశ్ హెడ్ జోరు కొనసాగించాడు. నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 26 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. 10.3 ఓవర్లలో 150 పరుగులు చేసిన సన్‌రైజర్స్‌కు ఇన్నింగ్స్ 13వ ఓవర్లో సునీల్ నరైన్ బ్రేక్ వేశాడు. ట్రావిశ్ హెడ్ వికెట్ పడగొట్టిన నరైన్.. ఆ ఓవర్లో బౌండరీ ఇవ్వలేదు.
పవర్‌ప్లే ముగియగానే క్రీజులోకి వచ్చిన హెన్రిచ్ క్లాసెన్.. ట్రావిశ్ హెడ్ నిష్క్రమణ తర్వాత విశ్వరూపం చూపించాడు. ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 17 బంతుల్లో అర్థ సెంచరీ అందుకున్న క్లాసెన్..మరో 20 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. సునీల్ నరైన్, హర్షిత్ రానా సహా వరుణ్ చక్రవర్తిలను ఉతికారేసిన క్లాసెన్ 14.4 ఓవర్లలోనే సన్‌రైజర్స్‌ను 200 పరుగుల మార్క్ దాటించాడు. ఇసాన్ కిషన్ (29, 20 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) నెమ్మదిగా ఆడినా.. ఆఖరు ఓవర్లో అనికెత్ వర్మ (12 నాటౌట్) ఓ ఫోర్, సిక్సర్‌తో ఇన్నింగ్స్‌ను ముగించాడు. కోల్‌కత నైట్‌రైడర్స్ బౌలర్లలో సునీల్ నరైన్ (2/42) రెండు వికెట్లు పడగొట్టాడు. హెన్రిచ్ క్లాసెన్ ఊచకోతకు హర్షిత్ రానా 4 ఓవర్లలో 60 పరుగులు, వరుణ్ చక్రవర్తి 3 ఓవర్లలో 54 పరుగులు, రసెల్ 2 ఓవర్లలో 34 పరుగులు, ఎన్రిచ్ నోకియా 4 ఓవర్లలో 60 పరుగులు సమర్పించుకున్నారు. క్లాసెన్ ఐపీఎల్లో మూడో వేగవంతమైన సెంచరీ సాధించగా.. సన్‌రైజర్స్ ఐపీఎల్లో మూడో భారీ స్కోరు నమోదు చేసింది. ఐపీఎల్లో టాప్-4 భారీ స్కోర్లు రికార్డులు సైతం సన్‌రైజర్స్ పేరిట ఉండటం విశేషం.
బౌలర్లు అదుర్స్
రికార్డు ఛేదనలో కోల్‌కత నైట్‌రైడర్స్ చేతులెత్తేసింది. ఓపెనర్ సునీల్ నరైన్ (31) ఎదురుదాడికి ఆరంభంలోనే జైదేవ్ ఉనద్కత్ బ్రేక్ వేయగా.. క్వింటన్ డికాక్ (9), అజింక్య రహానె (15), రఘువంశీ (14), రింకు సింగ్ (9), అండ్రీ రసెల్ (0) విఫలం అయ్యారు. మనీశ్ పాండే (37), హర్షిత్ రానా (34) కోల్‌కతకు గౌరవప్రద స్కోరు అందించారు. సన్‌రైజర్స్ బౌలర్లు జైదేవ్ ఉనద్కత్, ఈషన్ మలింగ, హర్ష్ దూబెలు మూడేసి వికెట్లతో నైట్‌రైడర్స్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. పవర్‌ప్లేలో 59/2తో నిలిచిన కోల్‌కత..13.3 ఓవర్లలో 100 పరుగులు చేసింది. 18.4 ఓవర్లలో 168 పరుగులకు కుప్పకూలింది. గత సీజన్ ఫైనలిస్ట్‌లు కోల్‌కత, హైదరాబాద్ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేదు. గ్రూప్ దశ ఆఖరు మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గెలుపొందగా.. నైట్‌రైడర్స్ ఓటమితో సీజన్ నుంచి నిష్క్రమించింది.
క్లాసెన్ కుమ్మేశాడు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES