– సరిహద్దులు దాటుతున్న కొల్లాపూర్ మామిడి
– రైతుల నుంచి బలవంతంగా కొనుగోలు చేస్తున్న వ్యాపారులు
– స్థానిక ప్రజలకు రాలిన, పుచ్చుపోయిన పండ్లే దిక్కు
– నిలువునా నష్టపోతున్న రైతులు, కొనుగోలుదారులు
– స్థానికంగా అమ్ముకోనివ్వని వైనం
నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
నల్లమలలో పుట్టిన బంగినపల్లి మామిడి ఢిల్లీకి పయనమయింది. ఈ ప్రాంతం వారు కొనుగోలు చెద్దామన్నా.. ఏజెన్సీలు, బడా వ్యాపారస్తులు రైతుల దగ్గర బలవంతంగా కొనుగోలు చేసి డిల్లీ, మహారాష్ట్ర, ముంబాయితో పాటు అమెరికా, జర్మనీ అరబ్ దేశాలకు చేరవేస్తున్నారు. కొల్లాపూర్ బేనీషాన్ పండ్ల తోటలు నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి ప్రాంతాల్లో అధికంగా ఉన్నాయి. ఇక్కడ దిగుబడి అయిన పండ్లను ఈ ప్రాంతం వారికి దక్కకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాష్ట్రంలో మామిడి సీజన్ జోరుగా సాగుతున్న సమయంలో వ్యాపారుల ఆగడాలు పెచ్చరిల్లుతున్నాయి. మామిడి తోటల్లో పండ్లను కేజీకి రూ.30 పెట్టి బడా వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇక్కడి వారు మామిడి పండ్లను కొనుగోలు చేయాలంటే రూ.80లు పెట్లాల్సి వస్తోందని వినియోగదారులు తెలిపారు.
వాతావరణం ప్రతికూల పరిస్థితుల్లో ఈ ఏడాది మామిడి దిగుబడి సగానికి పైగా పడిపోయింది. 10 ఎకరాలకు 10 టన్నుల దిగుబడి రావాలి. అయితే ఈసారి 4 టన్నుల దిగుబడి కూడా రావడం లేదు. వచ్చిన దిగుబడిని ఇతర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. కొల్లాపూర్ బేనీషాన్‌ను కొనుగోలు చేయడానికి పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో బడా వ్యాపారులు ఇక్కడ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతుల దగ్గర కొనుగోలు చేసిన మామిడిని ఇక్కడే ప్యాక్‌చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పండ్ల మార్కెట్‌కు మామిడి రావడంతో వారం రోజులుగా మహబూబ్‌నగర్ నుంచి హైదరాబాద్ మార్కెట్‌కు మామిడిని తరలిస్తున్నారు. ప్రతి ఏటా ఉమ్మడి జిల్లాలో మామిడి పండ్ల కొరత రాకుండా ఇక్కడ కొంత అమ్ముకుంటూ మిగిలిన సరుకును హైదరాబాద్ తరలించేవారు. ఈసారి అలా కాకుండా వ్యాపారులు బేనేషాన్ మామిడిని కొనుగోలు చేసి బెంగుళూరు, ముంబాయి, గుజరాత్, కోయంబత్తూరుతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మామిడి కొనుగోళ్లలో రైతులను కమీషన్ ఎజెంట్లు, వ్యాపారులు నిలువునా ముంచుతున్నారు. కోటి జనాభా ఉన్న హైదరాబాద్ నగరానికి సరిపడే పండ్లు నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుండే సరఫరా అవుతున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో మామిడి తోటలు 70వేల ఎకరాలకు పైగానే ఉన్నాయి. నారాయణపేట, గద్వాల, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాలో మరో 50 వేల ఎకరాల మామిడి తోటలున్నాయి. ఇక్కడి నుంచి వచ్చే మామిడికాయ మొత్తం పూర్తిగా స్థానికంగా గాకుండా ఇతర ప్రాంతాలకు చేరవేస్తున్నారు.
మాకు అధిక ధరలకు అమ్ముతున్నారు
బయటకు మాత్రం కిలో రూ.30లకు అమ్మి మాకు రూ. 60లకు అమ్ముతున్నారు. అందుకే మేము అధిక ధరలకు అమ్మవలసి వస్తోంది. లీజుకు తీసుకున్న తోటల వాళ్లం అధికంగా నష్టపోతున్నాం.
నారమ్మ, కొల్లాపూర్
రైతుల వద్ధ ఖరీదు చేసి డిల్లీ పంపిస్తున్నాం
వారు అక్కడి నుంచి ఇతర దేశాలైన అమెరికా, అరబ్ దేశాలకు పంపిస్తారు. మచ్చలేని కాయలకు మంచి రేటు ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రాంత బేనీషాన్, తోతాపరి, దసేరి వంటి పండ్లకు ఇతర ప్రాంతాల్లో మంచి ఆదరణ ఉంది.
– భారీమోద్ధీన్, మామిడి కాయల ఎగుమతిదారుడు
పక్క రాష్ట్రాలకు రూ.30, ఇక్కడి వారికి రూ 80
మహబూబ్‌నగర్‌లో సాగైన బేనీషాన్ మామిడికి మంచి గిరాకీ ఉంది. శ్రీశైలం, హైదరాబాద్, కర్నూల్ వారు ఇక్కడి నుంచి పండ్లను తీసుకొని వెళ్తుంటారు. గత రెండేండ్లుగా మామిడి దిగుబడి భారీగా తగ్గింది. దాంతో మామిడి కాయలకు కొరత ఏర్పడింది. ఇలాంటి సందర్భంలో మామిడి కాయలను ఖరీద్ చేయడానికి దళారీ వ్యాపారులు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అతి తక్కువ ధరకు మామిడికాయలను కొని ఇతర దేశాలు, ప్రాంతాలకు తరలిస్తున్నారు. రైతుల నుంచి వ్యాపారులు కిలో రూ. 30 ఖరీదు చేసి అవే పండ్లను ఇక్కడే కిలో రూ. 80కు అమ్ముతున్నారు. మచ్చలేని కాయలు ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడి వారికి నాణ్యమైన మామిడి పండ్లు దొరకడం గగనంగా మారింది. బేనీషాన్ మామిడి పండ్లు రైతులకు కరువయ్యాయి. కొల్లాపూర్ బేనీషాన్ పండ్లను కొనుగోలు చేయడానికి ఎంఎఫ్‌సీ కంపెనీ వారు పెద్దకొత్తపల్లిలో తిష్టవేశారు. తోతాపరి కిలో రూ.20, బేనీషాన్ రూ. 30, కేసరి రూ. 40, దసేరి రూ. 40.. ఇలా తక్కువ ధరకు కంపెనీలు ఖరీదు చేసి అధిక ధరకు అమ్ముతున్నారు. దాంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. చూటు పేరుతో 10 క్వింటాళ్లకు 1 క్వింటా అదనంగా తూకం చేస్తూ రైతులను నిలువునా ముంచుతున్నారు. సన్న కాయ, మచ్చలు వచ్చిన కాయ పేరుతో మరింత ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు.