Wednesday, April 30, 2025
Homeఆటలుకోల్‌కత మురిసె!

కోల్‌కత మురిసె!

– 14 పరుగుల తేడాతో నైట్‌రైడర్స్‌ గెలుపు
– కోల్‌కత 204/9, ఢిల్లీ 190/9

నవతెలంగాణ-న్యూఢిల్లీ

కోల్‌కత నైట్‌రైడర్స్‌ మురిసింది. ప్లే ఆఫ్స్‌ రేసులో ఆశలు సజీవంగా నిలుపుకుంది. భీకర ఫామ్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌పై 14 పరుగుల తేడాతో కోల్‌కత నైట్‌రైడర్స్‌ మెరుపు విజయం సాధించింది. 205 పరుగుల ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులే చేసింది. డుప్లెసిస్‌ (62, 45 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీకి తోడు అక్షర్‌ పటేల్‌ (43, 23 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ గెలుపు దిశగా సాగింది. ఇక్కడే, నైట్‌రైడర్స్‌ మాయగాడు సునీల్‌ నరైన్‌ (3/29) మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఇన్నింగ్స్‌ 14వ ఓవర్లో అక్షర్‌ పటేల్‌ సహా ట్రిస్టన్‌ స్టబ్స్‌ (1) వికెట్లు పడగొట్టిన నరైన్‌ నైట్‌రైడర్స్‌ను రేసులోకి తీసుకొచ్చాడు. ఆఖర్లో విప్‌రాజ్‌ నిగమ్‌ (38, 19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేసినా.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు నిరాశే మిగిలింది. ఆషుతోశ్‌ శర్మ (7) వికెట్‌తో వరుణ్‌ చక్రవర్తి 18వ ఓవర్లోనే కోల్‌కత గెలుపు లాంఛనం చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటర్లలో అభిషేక్‌ పోరెల్‌ (4), కరుణ్‌ నాయర్‌ (15), కెఎల్‌ రాహుల్‌ (7) నిరాశపరిచారు. పది మ్యాచుల్లో కోల్‌కతకు ఇది నాల్గో విజయం కాగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు పది మ్యాచుల్లో ఇది నాల్గో పరాజయం.
సమిష్టి మెరుపుల్‌ :
తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కత నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 204 పరుగులు చేసింది. బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. ఓపెనర్లు రెహ్మనుల్లా గుర్బాజ్‌ (26, 12 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), సునీల్‌ నరైన్‌ (27, 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్‌ జోరు చూపించారు. మూడు ఓవర్లలోనే 48 పరుగులు జోడించిన ఓపెనర్లు భారీ స్కోరుకు గట్టి పునాది వేశారు. కెప్టెన్‌ అజింక్య రహానె (26, 14 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడు చూపించగా.. యువ బ్యాటర్‌ రఘువంశీ (44, 32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. వెంకటేశ్‌ అయ్యర్‌ (7) మరోసారి నిరాశపరచగా.. రింకు సింగ్‌ (36, 25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), అండ్రీ రసెల్‌ (17, 9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఆఖర్లో దంచికొట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ (3/43) మూడు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు. విప్‌రాజ్‌ నిగమ్‌ (2/27), కుల్దీప్‌ యాదవ్‌ (2/27) ఆకట్టుకున్నారు. పవర్‌ప్లేలో 79/1తో దూకుడుగా ఆడిన నైట్‌రైడర్స్‌ వికెట్లు పడుతున్నా.. ఎక్కడా వెనక్కి తగ్గలేదు. స్టార్క్‌, కుల్దీప్‌, విప్‌రాజ్‌ మెరిసినా.. నైట్‌రైడర్స్‌ 204 పరుగుల భారీ స్కోరు సాధించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img