నవతెలంగాణ హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక విధానాలు, ఆర్థిక నిర్భందాలే పెట్టుబడిదారి పతనానికి నిదర్శనమని, రాబోయే కాలం కమ్యూనిష్టులదేనని సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్ పూర్వ కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని నవతెంగాణ హెడ్ ఆఫీస్‌లో కొరటాల సత్యానారాయణ 19వ వర్థంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థ సీజీఎం ప్రభాకర్ అధ్యక్షత వహించగా పి. మధు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ… ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలతో ట్రేడ్ వార్ మొదలు పెట్టి… ఆర్థిక సంక్షోభానికి తెరలేపారని, చైనా, కెనడా, మెక్సికో దేశాల ఎగుమతులపై అధిక శాతం సుంకాలు పెంచి, ఆయా దేశాల ఆర్థిక ప్రయోజనాలను ట్రంప్ దెబ్బతీయాలని ప్రణాళిక రచించారని ఆయన మండిపడ్డారు. యూఎస్ అధ్యక్షుని విధానాలను ముక్త కంఠంతో పలు దేశాలు విభేదించాయని, దీంతో 90 రోజుల వాయిదా పేరుతో అమెరికా వెనుకడుగు వేసిందని విమర్శించారు.
అమెరికా ప్రతీకార సుంకాల పేరుతో పెట్టుబడిదారి వర్గాల్లో ఓ రకమైనా భయాందోళనకు కారణమైందని, ప్రపంచదేశాలు ఆర్థిక సంక్షోభ ఊబిలో పడే పరిస్థితి తలెత్తిందని ఆయన వివరించారు. ఈ పరిణామాలు పెట్టుబడిదారి వ్యవస్థకు చెంపపెట్టు లాంటిదన్నారు. కమ్యూనిజంను భూతంలా చూపెట్టే ట్రంప్ ప్రయత్నాలు బేడుసుకొట్టాయని ఎద్దేవా చేశారు.
మార్కిష్టు నియమాలను త్రికరణ శుద్ధిగా ఆచరణలో పెట్టిన గొప్ప నాయుకుడు కొరటాల సత్యనారాయణ అని కొనియాడారు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా అనేక సమస్యలపై పోరాటాలు చేశామని, ఎన్నో నిర్భందాలు ఎదురుకున్నామన్నారు. ఎండ్ల తరబడి కొరటాల జైలు జీవితం అనుభవించారని తెలిపారు. కమ్యూనిష్టులకు గడ్డుకాలమున్న 1960 దశకంలో ప్రజాసమస్యలపై గళమెత్తిన ధీశాలి కొరటాల సత్యానారాయణ అని గుర్తు చేశారు. ప్రజల తరుపున పోరాటానికి కమ్యూనిష్టులు ముందుంటారని, సీట్ల కోసం, రాజకీయ పదవుల కోసం, అవకాశాల కోసము కమ్యూనిష్టులు ఆశపడరని తెలిపారు.
సభకు అధ్యక్షత వహించిన నవతెలంగాణ సీజీఎం పి.ప్రభాకర్ మాట్లాడుతూ… ప్రజాశక్తి సాహితీ సంస్థ చైర్మన్ గా కొరటాల సత్యనారాయణ చేసిన సేవలను గుర్తుచేశారు. ఈ సభలో నవతెలంగాణ ఎడిటర్ ఆర్. రమేష్, బుక్ హౌస్ ఎడిటర్ కె. ఆనందాచారి, జనరల్ మేనేజర్లు, బోర్డు సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.