– ఆల్‌రౌండ్ షోతో మెరిసిన పాండ్య
– ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆర్‌సీబీ ఘన విజయం- ఢిల్లీ 162/8, బెంగళూర్ 165/4
ఐపీఎల్18లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ప్రత్యర్థి సొంతగడ్డపై వరుసగా ఆరు విజయాలు సాధించిన తొలి జట్టుగా రాయల్ చాలెంజర్స్ నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢిల్లీలోనే చిత్తుచేసిన బెంగళూర్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. కృనాల్ పాండ్య (73 నాటౌట్) ఛేదనలో అజేయ అర్థ సెంచరీతో రాణించాడు. ఈ విజయంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ పాయింట్ట పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
నవతెలంగాణ-న్యూఢిల్లీ
కృనాల్ పాండ్య (73 నాటౌట్, 47 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (51, 47 బంతుల్లో 4 ఫోర్లు) అర్థ సెంచరీలతో చెలరేగారు. 26/3తో ఓ దశలో బెంగళూర్ కష్టాల్లో కూరుకున్న స్థితిలో విరాట్ కోహ్లి, కృనాల్ పాండ్య జోడీ నాల్గో వికెట్‌కు శతక భాగస్వామ్యం నిర్మించింది. ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ చిత్తు చేసింది. ఓపెనర్ జాకబ్ బెతెల్ (12), దేవదత్ పడిక్కల్ (0), రజత్ పాటిదార్ (6) వరుసగా నిష్క్రమించటంతో ఢిల్లీ క్యాపిటల్స్ పట్టు సాధించింది. విరాట్ కోహ్లి, కృనాల్ పాండ్య ధనాధన్ మెరుపులతో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను ఆడుకున్నారు. ఆఖర్లో టిమ్ డెవిడ్ (19 నాటౌట్, 5 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకునే ఇన్నింగ్స్ ఆడాడు. 18.3 ఓవర్లలోనే 4 వికెట్లకు 165 పరుగులు చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ మరో 9 బంతులు ఉండగానే లాంఛనం ముగించింది. సీజన్లో ఏడో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానం దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలో ప్రత్యర్థి జట్టు సొంతగడ్డపై వరుసగా ఆరు మ్యాచుల్లో విజయాలు సాధించిన ఏకైక జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిసిన కృనాల్ పాండ్య ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
ఆర్‌సీబీ పేసర్లు భువనేశ్వర్ కుమార్ (3/33), జోశ్ హాజిల్‌వుడ్ (2/36) రాణించటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులే చేసింది. కెఎల్ రాహుల్ (41, 39 బంతుల్లో 3 ఫోర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (34, 18 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), అభిషేక్ పోరెల్ (28, 11 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), డుప్లెసిస్ (22, 26 బంతుల్లో 2 ఫోర్లు) రాణించారు. కరుణ్ నాయర్ (4), అక్షర్ పటేల్ (15), ఆషుతోశ్ శర్మ (2) నిరాశపరిచారు. విప్రాజ్ (12) ఆఖర్లో ఓ సిక్సర్‌తో మెప్పించాడు. 9 మ్యాచుల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది మూడో ఓటమి కాగా.. పది మ్యాచుల్లో ఆర్‌సీబీకి ఇది ఏడో విజయం.