నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ఓడించడం ద్వారానే, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేస్తుందని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కకుండా చిత్తుగా ఓడించాలని కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. అలాంటి ఓటమి రుచి చూస్తేనే అధికార పార్టీకి భయం పట్టుకుంటుందని, అప్పుడే పెండింగ్‌లో ఉన్న హామీల అమలుపై దృష్టి పెడుతుందని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయి వాస్తవాలు అర్థమవుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు.
ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ‘ఆపదమొక్కులు’ మొక్కుతోందని కేటీఆర్ విమర్శించారు. పార్టీ పరువు కాపాడుకోవడం కోసమే రకరకాల ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే సినీ కార్మికులకు కొత్త వాగ్దానాలు చేయడం, మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకోనుండడం, మంత్రులు గతంలో ఎన్నడూ లేనంత హడావుడిగా హైదరాబాద్ వీధుల్లో తిరగడం వంటివి చేస్తున్నారని ఆరోపించారు. ఇవన్నీ కాంగ్రెస్ తీవ్ర ఒత్తిడిలో ఉందనడానికి నిదర్శనమని కేటీఆర్ తెలిపారు. ఈ ఉపఎన్నికలో ప్రజలు కాంగ్రెస్‌కు గట్టిగా బుద్ధి చెబితేనే, రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.



