నవతెలంగాణ-హైదరాబాద్: నెల్లూరు యాక్సెస్ బ్యాంకులో కుబేర బ్యాచ్ చేసిన అక్రమాలు, అవినీతి బయటకొస్తుంటే బాధితులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. 2020 నాటి నుంచే ఈ బ్యాచ్ ఇలాంటి అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రూ.20 కోట్లు చెబుతుండగా పరిస్థితి చూస్తే రాష్ట్ర వ్యాపితంగా వందల కోట్లు మింగేశారు. ”ప్రజాశక్తి” ఈ వ్యవహారాన్ని బయటకు తీసుకువచ్చింది.
ఓ నిరుపేద మహిళ పరిస్థితి ప్రతి ఒక్కరీ హృదయాలను కదిలిస్తోంది. ఒంగోలు దళితవాడకు చెందిన మోక తనుజా కాకినాడ వీరవనం గ్రామానికి చెందిన మోబీష్‌తో ఏడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.ఉన్న ఊర్లో జీవించలేక 2021లో నెల్లూరుకు వలస వచ్చారు. నగరంలోని వనంతోపు సెంటర్‌లో అద్దె ఇంట్లో నివాసముండగా, ఆ సమయంలో అక్కడ జాలె వాసుదేవనాయుడు మోబీస్‌కు సెక్యూరిటీ గార్డు ఉద్యోగం ఇప్పించారు.
ఈ పరిచయంతో తనూజకు ఓ టీ దుకాణంలో పనికి కుదిర్చారు. కుటుంబ పరిస్థితులు బాగ లేకపోవడంతో డబ్బులు కావాలని వాసుదేవనాయుడును కోరగా.. బ్యాంక్ నుంచి అప్పు ఇప్పిస్తానని ఆధార్‌కార్డు, బ్యాంక్ బుక్ తీసుకున్నారు. రెండు లక్షల రూపాయలు ఇచ్చాడు. ప్రతి నెలా రూ.20వేలు చొప్పున మొత్తం చెల్లించింది. మరోసారి భర్తకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మళ్లీ రూ.మూడు లక్షలు కావాలని కోరగా… బ్యాంక్ రుణమని చెప్పి ఇచ్చారు. ప్రతి నెలా రూ.25 వేల చొప్పున ఆ మొత్తం చెల్లించారు.
ఇటీవల కాలంలో బ్యాంక్ నుంచి ఆమెకు తరచూ ఫోన్లు రావడంతో ఖంగుతిన్నారు. నగరంలోని ఆర్‌టిసి యాక్సెస్ బ్యాంక్ అధికారులు నుంచి ఫోన్ రావడంతో బ్యాంక్‌కు వెళ్లింది. మీరు స్టాఫ్‌వేర్ ఉద్యోగినే కదా మీ పేరు మీద మా బ్యాంక్‌లో రూ.35 లక్షలు రుణం తీసుకున్నారని బాంబు పేల్చారు. తనకు ఏమీ తెలియదని, తాను అక్కడక్కడా పాచిపని చేసుకుంటానని, వాసుదేవనాయుడు నాకు డబ్బులిస్తే తిరిగి చెల్లించానని చెప్పినా బ్యాంక్ అధికారులు ఒప్పుకోలేదు. మీరే చెల్లించాలంటూ బెదిరింపులకు దిగారు.
ఇంటికొచ్చిన ఆమెకు చెన్నై యాక్సెస్ బ్యాంక్ నుంచి మరో ఫోన్ వచ్చింది. మీ పేరుపై మా బ్యాంక్‌లో రూ. 65 లక్షలు రుణం తీసుకున్నారని, ఎప్పుడు చెల్లిస్తారని ఆరా తీశారు. జగ్గయ్యపేట బ్యాంక్ నుంచి మరో రూ.45 లక్షలు బకాయి ఉన్నట్లు అధికారులు ఫోన్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఆ కుటుంబం నివ్వెరపోయింది. తనకు తెలియకుండా ఇంత డబ్బులు ఏం చేశావంటూ భర్త మోబీస్ భార్య తనూజతో గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తనకు బ్యాంక్ ఎక్కడుందో తెలియదని, మా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశారని ఆమె వాపోయారు.